సన్‌రైజర్స్‌ చిత్తు

– 213 పరుగుల ఛేదనలో చతికిల
– సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో ఐదో విజయం
– చెన్నై 212/3, హైదరాబాద్‌ 134/10
నవతెలంగాణ-చెన్నై
విధ్వంసక బ్యాటింగ్‌తో ఐపీఎల్‌ 17 సీజన్‌ను వేడెక్కించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండు మ్యాచుల్లో భారీ స్కోర్ల ఛేదనలో చతికిల పడింది. చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో 78 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ట్రావిశ్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), అన్మోల్‌ ప్రీత్‌ (0), నితీశ్‌ కుమార్‌ (15), హెన్రిచ్‌ క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (18) అంచనాలకు తగినట్టు ఆడటంలో విఫలమయ్యారు. 18.5 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలిన సన్‌రైజర్స్‌ సీజన్లో నాల్గో ఓటమి మూటగట్టుకుంది. అంతకుముందు, రుతురాజ్‌ గైక్వాడ్‌ (98, 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. డార్లీ మిచెల్‌ (52, 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం అర్థ సెంచరీతో రాణించటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్‌ అజింక్య రహానె (9) విఫలమైనా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (98), డార్లీ మిచెల్‌ (52) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 బంతుల్లోనే గైక్వాడ్‌ అర్థ సెంచరీ సాధించగా.. డార్లీ మిచెల్‌ సైతం ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. శివం దూబె నాలుగు సిక్సర్లతో అలరించగా.. ఆఖర్లో ఎం.ఎస్‌ ధోని ఓ బౌండరీతో చెపాక్‌కు ఊర్రూతలూగించాడు.

Spread the love