– ఛేదనలో తెలుగోడి అద్భుత ఇన్నింగ్స్
– రెండో టీ20లో భారత్ ఘన విజయం
నవతెలంగాణ-చెన్నై
తెలుగు తేజం తిలక్ వర్మ (72 నాటౌట్, 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఛేదనలో సహచర బ్యాటర్లు విఫలమైనా ఓ ఎండ్‌లో నిలబడిన తిలక్ వర్మ ఆఖరు వరకు క్రీజులో నిలబడ్డాడు. టెయిలెండర్ల అండతో చెపాక్‌లో భారత్‌కు సూపర్ విక్టరీ అందించాడు. తిలక్ వర్మ అజేయ అర్థ సెంచరీతో ఇంగ్లాండ్‌పై భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (26, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ (45, 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్ కార్సె (31, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22, 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించటంతో 165/9 పరుగులు సాధించింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
తిలక్ ఒక్కడే : భారత్ లక్ష్యం 166 పరుగులు. చెపాక్ పిచ్‌పై ఇంగ్లాండ్ పేసర్లతో బరిలోకి దిగింది. భారత్‌కు ఇదేమీ పెద్ద సవాల్ కాదు అనిపించింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు ఆతిథ్య జట్టును ఇరకాటంలో పడేశారు. అభిషేక్ శర్మ (12), సంజు శాంసన్ (5), సూర్యకుమార్ యాదవ్ (12), ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్య (7) నిరాశపరచటంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. స్పెషలిస్ట్ బ్యాటర్లు అందరూ డగౌట్‌కు చేరగా.. 78/5తో భారత్ ఓటమి ప్రమాదంలో పడింది. ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ (26)తో కలిసి తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఒక్కో పరుగూ జోడిస్తూ లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లాడు. సుందర్ నిష్క్రమణతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అక్షర్ పటేల్ (2), అర్షదీప్ సింగ్ (6) తేలిపోయారు. 146/8తో ఓ ఎండ్ నుంచి సహకారం లోపించింది. ఇక్కడ దూకుడు జోడించిన తిలక్ వర్మ వేగంగా పరుగులు పిండుకున్నాడు. మరో నాలుగు బంతులు ఉండగానే ఉత్కంఠకు తెరదించాడు. రవి బిష్ణోరు (9 నాటౌట్) ఆఖర్లో రెండు బౌండరీలతో మెరిశాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 39 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన తిలక్ వర్మ ఒత్తిడిలో అసమాన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 165/9 (జోశ్ బట్లర్ 45, బ్రైడన్ కార్సె 31, అక్షర్ పటేల్ 2/32, వరుణ్ 2/38)
భారత్ ఇన్నింగ్స్ : 166/8 ( తిలక్ వర్మ 72 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 26, కార్సె 3/29, రషీద్ 1/14)
నితీశ్,రింకు అవుట్
తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, ఫినిషర్ రింకు సింగ్‌లు గాయం బారిన పడ్డారు. చెపాక్‌లో రెండో టీ20 ముంగిట ప్రాక్టీస్ సెషన్లో నితీశ్, రింకు గాయపడినట్టు బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. చెపాక్‌లో ఇంగ్లాండ్‌తో టీ20కి ఈ ఇద్దరు దూరం అయ్యారు. చివరి మూడు టీ20లకు నితీశ్, రింకు స్థానంలో శివం దూబె, రమణ్‌దీప్‌లను సెలక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసింది.