పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఎ సవాలుపై సుప్రీం విచారణ వాయిదా

పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఎ సవాలుపై సుప్రీం విచారణ వాయిదాన్యూఢిల్లీ : పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తున్న పలు పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఈ విచారణ జరగాల్సి వుండగా, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ఇందిరా జైసింగ్‌, పలువురు లాయర్ల అభ్యర్ధనపై విచారణను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ వాయిదా వేశారు.
అస్సామీల సంస్కృతి, వారసత్వం, భాష, సామాజిక గుర్తింపును పరిరక్షించేందుకు గానూ అస్సాం ఉద్యమ నేతలతో ఆనాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1985 ఆగస్టు 15న కుదుర్చుకున్న ఒప్పందానికి కొనసాగింపుగా సెక్షన్‌ 6ఎను చట్టంలో ప్రత్యేక నిబంధనగా పొందుపరిచారు.
అక్రమ శరణార్ధులను ప్రధానంగా బంగ్లాదేశ్‌ నుండి వచ్చేవారిని గుర్తించి, రాష్ట్రం నుండి పంపివేయడానికి ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (అసు) ఆరేళ్లుగా చేసిన ఉద్యమం ఫలితంగా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. సెక్షన్‌ 6ఎ కింద 1966 జనవరి 1కి ముందుగా అస్సాంలోకి ప్రవేశించిన వారిని సాధారణ పౌరునిగా గుర్తిస్తారు. వారికి భారత పౌరులకు వుండే అన్ని హక్కులు, బాధ్యతలు వర్తిస్తాయి. 1966 జనవరి 1 నుండి 1971 మార్చి 25 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించిన వారికీ అన్ని హక్కులు వుంటాయి, కానీ వారు పదేళ్లపాటు ఓటు వేయలేరు. అయితే సెక్షన్‌ 6ఎ స్వభావం వివక్షతో కూడి వుందంటూ దాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇమ్మిగ్రెంట్లకు పౌరసత్వం మంజూరు చేసే కటాఫ్‌ డేట్‌ను రాజ్యాంగంలోని సెక్షన్‌ 6కింద 1948 జులై 19గా నిర్దేశించారని ఆ పిటిషన్‌దారులు వాదిస్తున్నారు. 2015లో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఇన్నేళ్లుగా సెక్షన్‌ 6ఎ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వుంది. 19లక్షల మందిని మినహాయిస్తూ 2019 ఆగస్టులో తుది అస్సాం ఎన్‌ఆర్‌సి జాబితాను సిద్ధం చేశారు. మళ్లీ ఆ జాబితాను పరిశీలించాలంటూ అస్సాం ఎన్‌ఆర్‌సి అథారిటీ కోర్టును ఆశ్రయించింది.

Spread the love