మణిపూర్‌ హింసపై సుప్రీం కీలక నిర్ణయం

– సీబీఐ కేసులను అస్సాం హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు
– బాధిత, గిరిజన తరఫు న్యాయవాదుల నుంచి వ్యతిరేకత
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసకు సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తున్న 17 హింసాత్మక కేసులను అసోంకు బదిలీ చేసింది. వాటిని పరిష్కరించడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయాధికారులను నియమించాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఇందులో కాంగ్‌పోక్పి జిల్లాలో ఒక గుంపు నగంగా ఊరేగించిన కుకీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు కూడా ఒకటి. దాడికి సంబంధించిన వీడియో జులై 19న సోషల్‌ మీడియాలో వైరలైన విషయం విదితమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితులు, సాక్షులను వాస్తవంగా విచారించడంతో సహా పలు ఆదేశాలను ఆమోదించింది. ప్రస్తుత దశలో మణిపూర్‌లోని మొత్తం వాతావరణాన్ని,, నేర న్యాయ నిర్వహణ యొక్క న్యాయమైన ప్రక్రియను నిర్ధారించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు జారీ చేసినట్టు కోర్టు పేర్కొన్నది.అయితే, సుప్రీం కోర్టు నిర్ణయం పట్ల ప్రతివాదుల తరఫు లాయర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. బాధితులు, గిరిజన సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది న్యాయవాదుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసులను అసోంకు బదిలీ చేయాలనే ఉత్తర్వు రావటం గమనార్హం. సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గోన్సాల్వేస్‌ వాదిస్తూ.. నేరాలు జరిగిన అధికార పరిధిలోనే విచారణలు జర గాలనీ, బాధితులను అసోంకు వెళ్లాలని బలవంతం చేయలేమని అన్నారు. సీనియర్‌ న్యాయవాది నిజాం పాషా వాదిస్తూ.. కేసులను అసోంకు బదిలీ చేస్తే భాషా అవరోధం సమస్యలు తలెత్తుతాయనీ, మిజోరాంను ప్రత్యామ్నా య ప్రదేశంగా సూచించాలని అన్నారు. అసోంలో మెరుగైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ విషయమై కేంద్రం,మణిపూర్‌ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు కోర్టు వెల్లడించటం గమనార్హం.

Spread the love