– బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో దోషులు
న్యూఢిల్లీ : లొంగిపోవడానికి గడువును పొడిగించాలని కోరుతూ బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో 11 మంది దోషుల్లో ఐదుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరిం చింది. ఈ నెల 8న న్యాయమూర్తులు బి.వి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దోషులకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిని(దోషులను) రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దోషుల్లో ముగ్గురి తరఫున సీనియర్ న్యాయవాది వి. చితంబరేష్ వాదనలు వినిపించారు. వారు లొంగిపోవటానికి కోర్టు విధించిన గడువు జనవరి 21తో ముగుస్తున్నందున.. ఈ అంశాన్ని 19కి జాబితా చేయాలని నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మరికొంత కాలం గడువు కోరుతూ ఇతర దోషులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా దాఖలు చేస్తామని మరో న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులను హత్య చేసినందుకు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించబడింది. గుజరాత్ ప్రభుత్వం వారికి రెమిషన్ మంజూరు చేసిన తర్వాత వారు 2022, ఆగస్టు 15న విడుదలయ్యారు. దీంతో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 8న సర్వోన్నత న్యాయస్థానం దోషులకు మంజూరు చేసిన రెమిషన్‌ను రద్దు చేస్తూ, లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.