– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు రక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆక్రమణలను తొలగించి, మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని న్యాయస్థానం పిల్‌గా పరిగణించి విచారించింది. ఈ క్రమంలో హైకోర్టు గతంలో ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టును బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరథే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ పరిశీలించింది. చెరువు రక్షణకు కమిటీ చేసిన సిఫార్సులను రెండు దశల్లో అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ అధికారులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. రిపోర్టులను చిత్తశుద్ధితో అమలు చేయాలని, లేదంటే అధికారులను కోర్టుకు పిలిపించి విచారిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
పార్క్ స్థలం ఆక్రమణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో పిల్లల క్రీడల కోసం నిర్దేశించిన పార్కు స్థలం ఆక్రమణలకు గురికాకుండా తీసుకున్న చర్యలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అన్యాక్రాంతం కావడానికి సహకరించిన అప్పటి మున్సిపల్ కమిషనర్ శైలజను ప్రతివాదిగా చేర్చాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పార్క్ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించాలని కోరుతూ 23 మంది పిల్లలు హైకోర్టుకు లేఖ రాశారు.దీనిని సుమోటగా స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 1970లో ఆదిలాబాద్‌లో బడుగు వర్గాల సంక్షేమం కోసం హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటైంది. అందులో 15 ఎకరాలను పిల్లల పార్కు నిమిత్తం కేటాయించారు. ఆభూమిలో 30 గంటల స్థలాన్ని 2004 సమయంలో కొందరు ఆక్రమించుకోగా, ఇటీవల మిగిలిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు.
ఆక్రమణదారులకు మున్సిపల్ కమిషనర్ శైలజ సలహాలు ఇస్తున్నారని కూడా వాళ్లు ఆరోపించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మున్సిపల్ కమిషనర్ శైలజపై ఆరోపణలున్న కారణంగా ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ శైలజ ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా లేరని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
అద్దె చెల్లించనప్పుడు హక్కులుండవు: హైకోర్టు
హైదరాబాద్, నాంపల్లిలోని చేనేత భవన్‌లో వ్యాపారాలు చేసుకుంటూ అద్దె బకాయిలు చెల్లించలేని వారిని అక్కడ కొనసాగించాలన్న మహిళా పారిశ్రామికవేత్తల సంఘ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమను బలవంతంగా షాపుల ఖాళీ చేయించారనీ, తిరిగి తమకు చేనేత భవనాన్ని అప్పగించాలని సంఘం చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.ఇదే వ్యాజ్యాన్ని గతంలో సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీనిపై సంఘం చేసిన అప్పీల్‌ను మంగళవారం ధర్మాసనం కొట్టివేసింది. నాంపల్లిలోని 9200 చదరపు అడుగుల స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మహిళా పారిశ్రామికవేత్తల సంఘం 2011 నుంచి 2014వరకు అద్దెకు తీసుకుంది.
అద్దె ఒప్పందం గడువు అయ్యాక కూడా ఒప్పందం రెన్యువల్ చేసుకోకుండా అద్దె చెల్లిస్తూ కొనసాగింది. తర్వాత అద్దె చెల్లించకపోవడంతో రూ.50 లక్షల వరకు బకాయిలు చెల్లించాలంటూ 2022 అక్టోబర్‌లో రాష్ట్ర చేనేత సముదాయ సహకార సంఘం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత బలవంతంగా మహిళా పారిశ్రామికవేత్తల సంఘాన్ని ఖాళీ చేయించింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందం రద్దు తర్వాత కూడా పిటిషనర్ కొనసాగుతూ, లక్షల్లో అద్దె బకాయిలు ఉన్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చి ఆద్దె చెల్లించని వారికి రక్షణగా ఉండలేమని కోర్టు తేల్చి చెప్పింది.