‘ఊరుకో’ పరీక్ష

 'Ooruko' test– గురుకుల పోస్టుల పరీక్షల్లో గందరగోళం
– వందల కి.మీ తిరగలేక పలువురు ఎగ్జామ్స్‌కు దూరం
– టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌లో కొన్నింటికే హాజరు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన అరుణ కుమారి ఏపీలోని ఒంగోలులో అత్తారింట్లో ఉంటోంది. రెండునెలల చిన్నారికి తల్లయిన ఆమె ఈ పరీక్షల కోసం టేకులపల్లి వచ్చింది. టీజీటీ, పీజీటీ పోస్టులకు అప్లై చేసిన ఆమెకు హైదరాబాద్‌లో ఒక సెంటర్‌, మరో ఐదు పేపర్లకు సత్తుపల్లిలో కేంద్రాలను కేటాయించడంతో పరీక్షలకు వెళ్ల లేక.. విరమించుకుంటున్నట్టు ‘నవతెలంగాణ’కు తెలిపారు.
నిజామాబాద్‌కు చెందిన రమాదేవికి 4వ తేదీన టీజీటీ పరీక్ష మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మల్లాపూర్‌లో ఎగ్జామ్‌ ఉండగా 9న మేడ్చల్‌ జిల్లా మౌలాలిలో పీజీటీ ఉంది. ఆ తర్వాత 10న రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారంలో పీజీటీ మరో పేపర్‌, 14న టీజీటీ భాగ్యలతా నగర్‌, రంగారెడ్డి జిల్లా, 16న డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) కరీంనగర్‌లో, 19న జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) ఓల్డ్‌ అల్వాల్‌, మేడ్చల్‌ జిల్లా, 21న మళ్లీ పీజీటీ మూడో పేపర్‌ నాచారం, తిరిగి టీజీటీ చివరి పేపర్‌ 22న కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో ఉండటంతో ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. ఇన్ని సెంటర్లు తిరగలేక, ఎగ్జామ్స్‌ అన్నీ ఓ క్రమపద్ధతిలో లేకపోవడంతో టీజీటీ, పీజీటీ, జేఎల్‌ పోస్టులకు మాత్రమే పరీక్షలు రాసి మిగిలిన డీఎల్‌ పరీక్షను విరమించుకోవాలని భావిస్తోంది. లేదంటే టీజీటీ, పీజీటీకే పరిమితం కావాలనుకుంటోంది.
ఖమ్మానికి చెందిన బిందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లిలోని వేర్వేరు కేంద్రాల్లో ఎగ్జామ్‌ సెంటర్స్‌ పడటంతో అన్ని పరీక్షలకు హాజరుకావడం కష్టమేనంటోంది. ఇలా రాష్ట్రంలో అనేక మంది అభ్యర్థులు అర్హతుండి, దరఖాస్తు చేసినా క్రమపద్ధతిలో లేని ఎగ్జామ్స్‌, వేర్వేరు ప్రాంతాల్లో సెంటర్ల మూలంగా పలు పోస్టుల పరీక్షలకు దూరమవుతున్న దుస్థితి ఉంది.
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీ కోసం ‘తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూ షన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొత్తం 9 రకాల పోస్టులకు పరీక్షలు..ఆగస్టు 1 నుంచి ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తాయి. టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌ ఎగ్జామ్స్‌, పీడీ, ఆర్ట్‌అండ్‌ క్రాఫ్ట్‌ తదితర పరీక్షల్లో.. పదో తరగతి అర్హతతో నిర్వహించే ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ మినహా మిగిలిన అన్ని పోస్టులకు మూడు పేపర్ల చొప్పున ఉంటాయి. పీజీ, బీఎడ్‌ చేసి టెట్‌, సెట్‌, నెట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులు నాలుగు పోస్టులకు అర్హులు. ఇలాంటి వారు జనరల్‌ స్టడీస్‌ కామన్‌ ఎగ్జామ్‌ ఒకటి రాస్తే సరిపోతుంది. మిగిలిన పోస్టుల కోసం రెండేసి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అంటే ఈ నాలుగు పోస్టులకు అర్హత ఉన్న ఒక్కో అభ్యర్థి తొమ్మిదికి పైగా పరీక్షలు రాయాల్సి వస్తుంది. అన్నీ ఆన్‌లైన్‌ విధానం కావడంతో పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా మారింది.
అర్హతున్నా.. అప్లై చేసినా.. పరీక్షలకు దూరం..
అన్ని అర్హతలుండి, అప్లై చేసినప్పటికీ ఊరుకో ఎగ్జామ్‌ సెంటర్‌ పడటంతో పలువురు ఈ పరీక్షల్లో కొన్నింటికి దూరం అవుతున్నారు. ఈ పరీక్షలన్నీ ఒకేచోట, టీజీటీ తర్వాత పీజీటీ, ఆ తర్వాత జేఎల్‌, డీఎల్‌ ఉంటే పర్వాలేదు. కానీ కలగూర గంపలాగా రాష్ట్రంలోని పట్టణాలకో సెంటర్‌ చొప్పున కేటాయించడంతో ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. దాంతో కొందరు టీజీటీ, పీజీటీ ఎగ్జామ్స్‌ రాసి, జేఎల్‌, డీఎల్‌ పరీక్షల ను విరమించుకుంటున్నారు. మరికొందరు జేఎల్‌, డీఎల్‌ పరీక్షలకు హాజరై పీజీటీ, టీజీటీ రాయడం మానేస్తున్నారు. పరీక్షా కేంద్రాల దూరభారంతో పిల్లల తల్లులు, గర్భిణులు పలువురు మొత్తానికే పరీక్షలకు దూరమవుతున్నారు. దాంతో పరీక్షా విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎందుకిలా.. ప్రత్యామ్నాయం లేదా..??
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల మెప్పు పొందాలనే తలం పుతో ప్రభుత్వం ఈ విపరీత చర్యకు దిగినట్టు అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పలువురు గురుకుల బోర్డు కన్వీనర్‌ డాక్టర్‌ మల్లయ్య బట్టుకు ఫోన్‌ చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ఎవరు ఫోన్‌ ఆన్సర్‌ చేస్తే వారితో తమ ఆవేదన చెబుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొత్తంగా 150 సెషన్స్‌లో నిర్వహించాల్సిన ఈ ఎగ్జామ్స్‌ను రోజుకు మూడు సెషన్స్‌ చొప్పున 50 సెషన్స్‌లో నిర్వహిస్తుండటం వల్లనే ఈ సమస్య వచ్చిపడినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పరీక్షల విషయంలో అబాసుపాలైన ప్రభుత్వం గురుకుల పోస్టుల భర్తీలోనూ అబాసుపాలవుతోంది. మొన్న నిర్వహించిన ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్ష తెలుగులో నిర్వహించాల్సి ఉండగా ఇంగ్లీష్‌లో పెట్టి విమర్శల పాలైంది.

Spread the love