ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలి

– టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ పెద్దవంగర: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం క్రియాశీలక పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి, జిల్ల ఉపాధ్యక్షుడు సోమారపు ఐలయ్య పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం పోరాటాలతో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీపీటీఎఫ్ ముందంజలో ఉంటుందన్నారు. విద్యారంగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబించడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కోర్టు పరిధిలో ఉన్నాయని, తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వాటిని వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 2003లో ఉపాధ్యాయుల నియామకం సీపీఎస్‌ కన్నా ముందే జరిగిందని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 6వేల మంది ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో పదోన్నతులు లేక కీలక పోస్టులను ఇన్చార్జిలతో నిర్వహించడం వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్ నాయక్, నాయకులు చింతల సురేష్, వల్లల శ్రీనివాస్,  కూరపాటి ఆంజనేయులు, కోట వెంకటేశం, కోట మురళి తదితరులు పాల్గొన్నారు.
Spread the love