నవతెలంగాణ-హైదరాబాద్ : రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాను డైరెక్టర్ తేజ తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తేజ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గతంలో తాను అనుభవించిన కష్టాలను వివరిస్తున్నారు. పలు సంచలన వ్యాఖ్యలూ చేస్తున్నారు. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘మీ ఫేవరేట్ హీరో ఎవరు?’ అని యాంకర్ అడగ్గా.. మహేశ్ బాబు, రజనీకాంత్, రామ్ చరణ్, ప్రభాస్ ఇష్టమని చెప్పారు. ‘‘ఇప్పుడున్న జనరేషన్ లో నాకు రామ్ చరణ్ బాగా నచ్చాడు. రంగస్థలంలో తన నటన చూసినప్పటి నుంచి అతనంటే ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో చరణ్ నటన, మ్యానరిజం బాగా చేశాడు’’ అని చెప్పారు. ‘‘ఎన్టీఆర్తో సినిమా చేయాలని అనుకుంటే ఎలాంటి సినిమా చేస్తారు’’ అని అడగ్గా.. ‘ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు’అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.