విత్తన భాండాగారంగా తెలంగాణ

– ఈ ప్రాంతం విత్తనోత్పత్తికి అనుకూలం
– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
– రాజేంద్రనగర్‌లో ”విత్తన మేళా -2023” ప్రారంభం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
తెలంగాణను ప్రపంచానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికీ రాష్ట్రం కొన్ని రకాల విత్తనాల్ని దిగుమతి చేసుకుంటున్నదని, భవిష్యత్తులో దీన్ని అధిగమించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ”విత్తన మేళా-2023”ను మంత్రి ప్రారంభించారు. కొంత మంది రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తుందని తెలిపారు. సాగునీటి సౌకర్యం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతం విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైందని చెప్పారు. రైతాంగం ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో తయారయ్యే విత్తనాలకి ఇతర ప్రాంతాల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రపంచానికంతటికీ విత్తనాలు సరఫరా చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని పరిరక్షించాలని సూచించారు. ఈ విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకి నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పశుపోషణకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. వివిధ వంగడాలపై విశ్వవిద్యాలయం రూపొందించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ప్రదర్శనల్ని తిలకించి విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన సంస్థ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కొండ బాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ కె.హనుమంతు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సుధీర్‌ కుమార్‌, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ సుధారాణి, విత్తన సంచాలకులు డాక్టర్‌ పి.జగన్‌మోహన్‌ రావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విత్తన మేళాకు రైతులు తరలి వచ్చారు.

Spread the love