అంగన్‌వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్‌వాడీలకు సంబంధించి ఇప్పటికే పలు జీవోలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజా మరో జీవో జారీ చేసింది. మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీలు మెయిన్‌ అంగన్‌వాడీలుగా మారనున్నాయి. మరోవైపు మినీ, మెయిన్‌ అంగన్‌వాడీల్లో పనిచేసే టీచర్లు, హెల్పర్లకు పలు సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయమైంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున లభించనుంది. టీచర్లు, హెల్పర్లకు 50 ఏళ్ల వయసు వరకు రూ.2 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. 50 ఏళ్ల పైబడిన వారికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.2 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది. సర్వీ్‌సలో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు మరణిస్తే వారి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్లు అయితే వారి కుటుంబానికి రూ.10 వేలు లభించనుంది. వీటితోపాటు ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు, హెల్పర్లకు ఆసరా పెన్షన్లను కూడా మంజూరు చేయనున్నట్టు ఉత్వర్వుల్లో ప్రభు త్వం పేర్కొం ది. ఈ ఉత్తర్వుల జారీ నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తన కార్యాలయం లో మంగళవారం పలువురు అంగన్‌వాడీలతో భేటీ అయ్యారు. ఉత్తర్వులను వారికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీలు సమ్మెను విరమించాలని కోరారు. ప్రస్తుతం సమ్మె చేస్తున్నవారు కేంద్ర ప్రభు త్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, త్వరలోనే వాటి పరిష్కారానికీ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీలకు పనిభారం తగ్గిస్తామని, యాప్‌లనూ సులభతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికేరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love