తెలంగాణది ప్రథమస్థానం

తాగు,సాగు జలాలకు పెద్దపీట : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-చౌటుప్పల్‌
తెలంగాణ రాష్ట్రం పర్యావరణం, పరిశ్రమల్లో దేశంలోనే ఆగ్రభాగాన ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామ 65 నెంబర్‌ జాతీయ రహదారి పక్కన రూ.95లక్షలతో ఏర్పాటు చేసిన కొయ్యలగూడెం చేనేత సహకార వస్త్ర విక్రయశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దండుమల్కాపురం గ్రామంలోని గ్రీన్‌ ఇండిస్టీయల్‌ పార్కులోని కామన్‌ ఫెసిలిటీ భవనంతోపాటు పారిశ్రామిక పార్క్‌లో ఉత్పత్తులు ప్రారంభించిన వివిధ రకాల పరిశ్రమల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించి ఉత్పత్తులను తిలకించారు. అదేవిధంగా 51 పరిశ్రమల్లో ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండిస్టీయల్‌ పార్క్‌లో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగతిని సాధించిందన్నారు. తెలంగాణలో సమగ్ర సమతుల్యత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. సాగు, తాగుజలాలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని తెలిపారు. పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్‌ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు. చరిత్రలో మూడవ అతిపెద్ద కార్యక్రమం హరితహారం అని అన్నారు. భవిష్యత్‌ తరాలకు సైతం పచ్చటి వాతావరణం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధించామన్నారు. పట్టణాలు కూడా జాతీయ అవార్డులు అందుకుంటున్నాయన్నారు. తెలంగాణ దేశానికే పాఠాలు నేర్పుతుందన్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హైదరాబాద్‌కు వచ్చి మరో న్యూయార్క్‌లాగా హైదరాబాద్‌ ఉందనడం తెలంగాణకు గర్వకారణం కాదా అని అన్నారు. 66ఏండ్లలో జరిగిన అభివృద్ధి పనులు కేసీఆర్‌ నాయకత్వంలో 9ఏండ్లలో అంతేస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. గుజరాత్‌లో ఈ రోజుకూ కరెంట్‌ కోతలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుందని అమెరికా ఇంజనీర్లు అన్నారని తెలిపారు. తెలంగాణలో ధాన్యం దిగుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అఖండ విజయాలను సాధిస్తోందన్నారు.
దండుమల్కాపురం పార్కులో ఏర్పాటుచేసిన బిల్డింగ్‌ సెంటర్‌లో వేలమంది యువతకు నైపుణ్య శిక్షణా ఇస్తామని తెలిపారు. టిఫ్‌ చైర్మెన్‌ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌ కుమార్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జెడ్పీచైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గీత కార్మిక కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌గౌడ్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, టీఎస్‌ఐఐసీ చైర్మెన్‌ గ్యాదరి బాలమల్లు, చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ వేన్‌రెడ్డిరాజు, వైస్‌ చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, గ్రామ సర్పంచ్‌ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాస్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Spread the love