తెలంగాణ ఇచ్చింది…అమ్ముకోవడానికి కాదు

Telangana gave...not to sell– అధికారంలోకి వచ్చాక మళ్లీ మద్యం టెండర్లు :రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది… భూములు అమ్ము కోవడానికి కాదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో మహ బూబ్‌నగర్‌, అలంపూర్‌ తదితర నియోజకవర్గాల నుంచి పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ చుట్టూ 10 వేల ఎకరాల భూమిని కేసీఆర్‌ కుటుంబం ఆక్రమించుకున్నదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయనీ, దీంతో ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తన అనుయాయులకు అప్పగించేందుకే మద్యం టెండర్లను నాలుగు నెలల ముందే వేశారనీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మళ్లీ వేస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదనీ, పోలీసులు వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో అన్ని సీట్లలో గెలుపు కోసం కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Spread the love