తెలంగాణ పథకాలు కర్ణాటకలో లేవు 

– ఉన్నాయని నిరూపిస్తే అంబేద్కర్‌ సాక్షిగా ముక్కు నేలకు రాస్తా…
– కావాలంటే కర్ణాటక వెళ్లి చూసి రండి
– విపక్షాల కార్యకర్తలను కోరిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి
– కుకునూర్‌, కోమన్‌పల్లి, వెంకటాపూర్‌ వేముల సురేందర్‌రెడ్డికి ఆత్మీయ గ్రామాలు
– తను చేసిన పనులు చిరస్థాయిగా మిగిలిపోతాయి
– ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి
 నవతెలంగాణ- కమ్మర్ పల్లి:  తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు లేవో విపక్ష పార్టీల కార్యకర్తలు ఆలోచించాని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆరెస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం ఉదయం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ మండలం కుకునూర్‌, కోమన్‌పల్లి, వెంకటాపూర్‌ గ్రామల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విపక్ష పార్టీల కార్యకర్తలు కర్ణాటక వెళ్లి చూసి వస్తే తెలంగాణ పథకాలు అక్కడ లేవని స్పష్టమవుతుందన్నారు. నేను చెప్పేది అబద్దమైతే అంబేద్కర్‌ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. తెలంగాణ పథకాలు అక్కడ లేవని అర్థం చేసుకుంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్‌ సహకారంతో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా తను చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయి తరతరాలకు ఉపయోగపడతాయన్నారు. ఈ పనుల ద్వారా తాను ప్రజల మనుసుల్లో నిలిచిపోతానని, ఇది తనకెంతో సంతృప్తి నిస్తుందని ఆయన అన్నారు. నీరడాయన పొలం ఎండిపోదు.. అన్న చందంగా బాల్కొండ నియోజకవర్గాన్ని నీరడాయన లాగా కాపాడుకుంటానన్నారు. తన సొంత వేల్పూర్‌ మండలంలోని కుకునూర్‌, కోమన్‌పల్లి, వెంకటాపూర్‌ గ్రామాలను కూడా ఇదే విధంగా కాపాడుకుంటున్నానన్నారు. ఈ గ్రామాలతో తమ కుటుంబానికి అవినాబావ సంబంధం ఎప్పటి నుంచో కొనసాగుతుందన్నారు. తన తండ్రి వేముల సురేందర్‌ రెడ్డి ఈ మూడు గ్రామల్లో ప్రతీ ఇంటి వారిని పేరు పెట్టి పిలిచేంత ఆత్మీయ సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఈ మూడు గ్రామాలకు సాగునీటిని అందించే నవాబు ఎత్తిపోతల కాలువను కోట్లాది రూపాయలతో సిమెంట్‌ లైనింగ్‌తో బాగు చేయించానన్నారు. అంతకు ముందు ఈ కాలువ నీటి కోసం గ్రామాల మధ్య గొడవలు జరిగేవన్నారు. ఏడు గ్రామాల్లో 12 చెరువులకు ఈ కాలువ ద్వారా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు అందుతున్నాయన్నారు. పక్కనే వాగులో చెక్‌డ్యాం నిర్మాణంతో బోరుబావులకు ఇబ్బంది లేకుండా పోయిందన్నారు.
అమర జవాన్ ర్యాడ మహేష్ విగ్రహానికి నివాళి
 కోమన్ పల్లి గ్రామంలో అమర జవాన్‌ ర్యాడ మహేశ్‌ విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కోమన్‌పల్లి చెందిన జవాన్‌ ర్యాడ మహేశ్‌ దేశం కోసం తన ప్రాణాలర్పిస్తే కొందరు గ్రామానికి వచ్చి వట్టి మాటలు చెప్పి పోయారన్నారు. ఒక అమర జవాన్ విషయంలో కూడా ఇలా వట్టి మాటలతో దులుపేసుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ర్యాడ మహేశ్‌ కుటుంబాన్ని ఆదుకుని సాయం అందించింది సీఎం కేసీఆర్‌, తానేనని విషయం కోమన్‌పల్లి గ్రామస్తులకు తెలిసిందేనన్నారు. కోమన్‌పల్లిలో ఆలయాల నిర్మాణాలకే కోటి రూపాయల వ్యయం చేశామని గుర్తు చేశారు. ఈ మూడు గ్రామాల్లో డబుల్‌ రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు. ఈ గ్రామాలకు రోడ్ల సౌకర్యంతో రైతుల భూముల విలువ పెరిగిందన్నారు. ఈ గ్రామలన్నింటిలో సీఎంఆర్‌ఫ్‌ సాయం వందలాది మందికి అందించానని అన్నారు. ముఖ్యమంత్రికి సీఎంఆర్‌ఎఫ్‌ ఉన్నట్లే కేంద్రంలో ప్రధాన మంత్రి సహాయనిధి కూడా ఉంటుందని,  ప్రధాని సహాయ నిధి నుంచి ఈ గ్రామాలలో బీజేపీ ఎంపీ అర్వింద్‌  ఎందరికి ఎంత డబ్బు  పీఎంఆర్ఎఫ్‌ నుంచి ఇప్పించారో చెప్పాలన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే గుడ్డిగా  బీజేపీ మాయమాటలకు లోనుకావద్దని యువతకు పిలుపునిచ్చారు. ఈ గ్రామాలు తన వేల్పూరులోని గ్రామాల్లాంటివేనన్నారు. మీరు ఎప్పుడైనా రావొచ్చు… ఏ పనైనా అడగవచ్చు.. మన మధ్య ఆ సతా ఉందని మంత్రి ఆ గ్రామాలతో ఆత్మీయ సంబంధాన్ని గుర్తు చేశారు. మరోసారి ఆశీర్వదించి బీఆఎస్‌ను గెలిపిస్తే ఐదేండ్లలో ఇప్పుడున్న 2వేల పింఛను 5 వేలకు,  10 వేల రైతుబంధు 16 వేలకు పెరుగుతుందన్నారు.మోడీ సిలిండర్‌ ధర ఎంత పెంచినా కేసీఆర్ 400 రూపాయలకే సిలిండర్‌ బుడ్డి అందిస్తారన్నారు. రేషన్‌ షాపుల ద్వారా ఇకపై సన్నబియ్యం పంపిణీ చేస్తారని, ఎటువంటి పింఛన్‌ రాని మహిళలకు ప్రతి నెలా రూ. 3వేలు అందిస్తారని చెప్పారు. మరోసారి ఆశీర్వదించి కేసీఆర్‌ను, తనను గెలిపించాలని మంత్రి వేముల కోరారు.  ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో యువకులు మంత్రి వేముల ను గజమాలతో సన్మానించారు. కోమన్‌పల్లిలో అంబేద్కర్‌ విగ్రహానికి,  ఆయా గ్రామాల మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.ప్రచార కార్యక్రమంలో మండల మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..
Spread the love