– ఈస్టర్ సందర్భంగా పుతిన్ ప్రకటన
మాస్కో : ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం ప్రకటించారు. మాస్కో కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో వుంటుందని తెలిపారు. ఈ సమయంలో అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయ బడతాయని ప్రకటించారు. చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ వాలెరి గ్రెసిమొవ్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుందని భావిస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు. అదే సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినా, శత్రువు నుంచి కవ్వింపు చర్యలు ఎదురైనా, దురాక్ర మణ చర్యలకు దిగినా వాటిని తిప్పి కొట్టడానికి తమ బలగాలు సిద్ధంగా వుండాలని పుతిన్ స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి లేని పక్షంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి అమెరికా వైదొలగుతుందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుక్రవారమే హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో పట్టున్న చిట్టచివరి ప్రాంతాల్లో ఒకదాన్నుంచి ఉక్రెయిన్ బలగాలను తమ సైన్యం పారద్రోలిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించిన రోజునే ఈ ప్రకటన వెలువడింది. గతేడాది కుర్క్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ బలగాలు అకస్మాత్తుగా చొరబడి స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్‌తో గల సరిహద్దులో కుర్క్క్ ప్రాంతంలో ఒలెషన్యా గ్రామాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఒలెషిన్యా గ్రామానికి దక్షిణంగా 11కిలోమీటర్ల ప్రాంతంలో భీకరంగా పోరాటం సాగిందని రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది.