పది పరీక్షలకు.. పది సూత్రాలు..

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు ఎస్.ఎస్.సి. బోర్డు ఈనెల 18వ తేదీ నుండి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిందే.ఇప్పటికే విద్యార్థులు హాల్ టికెట్స్ మరియు తమ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకునే ఉంటారు. పది పరీక్షలు ఒత్తిడి లేకుండా పదిలంగా రాయడానికి పది సూత్రాలు పాటిద్దాం.
1) సెల్ఫ్ మేనేజ్మెంట్: (స్వీయ నిర్వహణ): ఆత్మవిశ్వాసంతో పది పరీక్షలను ఎదుర్కోటానికి సంపూర్ణంగా మీరు సిద్ధంగా ఉన్నారని గ్రహించండి. పరీక్షలకు కావలసిన మానసిక సంసిద్ధత మీకు ఉందని తెలుసుకోండి. అనవసరపు అనుమానాలకు అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. సంవత్సరం అంతా మీరు చేసిన కష్టాన్ని తక్కువగా అంచనా వేయకండి. మన ఎమోషన్స్ మనమే నియంత్రించుకోవాలని గ్రహించండి. మిమ్మల్ని మీరు పూర్తిగా పరీక్షలకు సిద్ధం చేసుకున్నారని బలంగా నమ్మండి.
2) ప్రెషర్ మేనేజ్మెంట్:( ఒత్తిడి నిర్వహణ): మీకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలు విజయవంతంగా రాసి తమను తాము నిరూపించుకున్నారని తెలుసుకోండి. మీరు కూడా  ఎవరికంటే తక్కువ కాదని విశ్వసించండి. అనవసరపు ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ఒత్తిడి వలన పాజిటివ్ థింకింగ్ తగ్గుతుందని తెలుసుకోండి. మీ పట్ల మీరు నమ్మకాన్ని కలిగి ఉండి ఆశావహ దృక్పథాన్ని పెంచుకోండి.
3) టైం మేనేజ్మెంట్ :(సమయ నిర్వహణ): రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన సమయాన్ని విద్యాశాఖ కేటాయిస్తుందని తెలుసుకోండి. ఏ సబ్జెక్టు పేపర్ లో, ఏ సెక్షన్ లో, ఏ ఏ ప్రశ్నలకు ఎంత సమయంలో, ఎంత మేరకు సమాధానాలు వ్రాయాలో ఈపాటికే మీరు అభ్యాసం చేసి ఉన్నారని గుర్తుంచుకోండి. పరీక్షల అనంతరం ఇంటి వద్ద మరుసటి రోజు పరీక్షకు తయారవ్వడానికి ఖచ్చితమైన సమయపాలనను పాటించండి. ఏ సమయంలో ఏం చేయాలో ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని మన సమయాన్ని మనమే సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అర్థం చేసుకోండి.
4)హెల్త్ మేనేజ్మెంట్ (ఆరోగ్య నిర్వహణ): మన ఆరోగ్యం మనం తినే ఆహారం మరియు నిద్రించే సమయాన్నిబట్టి ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి. మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ ,సాఫ్ట్ డ్రింక్స్, మసాలా వంటలు ,పార్టీలు, ఫంక్షన్లు మొదలగు వాటికి దూరంగా ఉండండి. సొంతంగా ఎటువంటి వాహనాలను లైసెన్స్ లేకుండా, తల్లిదండ్రులు అనుమతి లేకుండా నడపకండి. అనవసరపు ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. మన కోసం ఏ రోజూ పరీక్షలు ఆగవని గ్రహించండి.
5) టార్గెట్ మేనేజ్మెంట్ (లక్ష్య నిర్వహణ): ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం చేసుకోండి. ఏ ఒక్క విషయంలో, ఏ ఒక్క సబ్జెక్టులో నిర్లక్ష్యం చేసినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని తెలుసుకోండి. అన్ని రకాలుగా మనల్ని మనం నియంత్రించుకోవడం అత్యంత అవసరమని అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని చిన్న  త్యాగాలు, జాగ్రత్తలు, నియమాలు, పెద్దల సలహాలు, సూచనలు పాటించడం వల్ల మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలమని గ్రహించండి. మనకు నచ్చిన విధంగా చేస్తే మనమే నష్టపోతామని తెలుసుకోండి.
6) సెల్ఫ్ ఎనాలసిస్ (స్వీయ విశ్లేషణ): పది పరీక్షలకు అనుగుణంగా మీ బలాలు, బలహీనతలు మీరే విశ్లేషించుకోండి. మీ గురించి మీకంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎవరూ లేరని తెలుసుకోండి.పరీక్షల విషయంలో మీ బలహీనతలను అభ్యాసం ద్వారా ఇప్పటికే దూరం చేసుకున్నారని నమ్మండి.  మీరే స్వయంకృషితో మీ శక్తి యుక్తులను పెంచుకున్నారని విశ్వసించండి.
7) క్వాలిటేటివ్ ఎనాలసిస్ (గుణాత్మక విశ్లేషణ):
మనం చేసే ప్రతి పనిలో క్వాలిటీ ఉండే విధంగా విశ్లేషించుకోవాలి. అందరూ చేసే పనిని మనం భిన్నంగా చేయాలి. ఈ లక్షణమే మనకు విజయాన్ని కలుగజేస్తుందని నమ్మండి. చేసే పని చిన్నదైనా పెద్దదైనా మనకంటే ఇంకెవరూ  ఇంతకంటే బాగా చేయలేని విధంగా మనం చేయాలని రుజువు చేసుకోండి. ప్రశ్నలకు మీ సమాధానాలు మీ క్వాలిటీ ప్రిపరేషన్ ను తెలియజేసే విధంగా అందరికంటే భిన్నంగా ఉండాలి.
8) కంపేరిటివ్ఎనాలసిస్ (తులనాత్మక  విశ్లేషణ): మీరు ఇప్పటివరకు రాసిన ప్రీ-ఫైనల్ పరీక్షలలో మీ సమాధానాలను మీకు మీరుగా పోల్చుకుంటూ తులనాత్మక విశ్లేషణ చేసుకోండి. ఒక్కొక్క పరీక్షలో మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ వచ్చారో మననం చేసుకోండి. ఇప్పుడు ఇంకా  మెరుగ్గా బోర్డు పరీక్షలు రాయబోతున్నారని గట్టిగా నమ్మండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ వేరెవరితోనూ పోల్చుకోకండి.మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని అవి వారి కి మాత్రమే సాధ్యమని తెలుసుకోండి. ఈ సృష్టిలో ఏ ఒక్కరూ తక్కువగా, అనవసరంగా సృష్టించబడలేదని అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి.
9)ఎర్రర్ రెక్టిఫికేషన్ (పొరపాట్లను సరిదిద్దుకోవడం): సంవత్సరమంతా మీరు రాసిన అన్ని పరీక్షలలో మీరు చేసిన పొరపాట్లను ఇప్పటికే సరిదిద్దుకున్నారని గుర్తు తెచ్చుకోండి. ఇవే తప్పులు బోర్డు పరీక్షలలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడబోతున్నామని తెలుసుకోండి. ఏ సబ్జెక్టులో, ఏ సెక్షన్ లో ,ఏ ఏరియాలో, ఏ పొరపాటు చేసి  ఏమరపాటుగా తక్కువ మార్కులు తెచ్చుకున్నామో, ఆ పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోండి.
10) ప్రజెంటేషన్ స్కిల్స్ (సమర్పణ నైపుణ్యాలు): మీరు సంవత్సరం అంతా ఎంత కష్టపడినా పరీక్షలలో మీరు మీ సమాధానాలను ప్రజెంట్ చేసిన విధానం ద్వారానే ఉత్తమ ఫలితాలను ఆశించబోతున్నారని అర్థం చేసుకోండి. చక్కటి గుండ్రటి చేతి వ్రాత అత్యంత అవసరం. సబ్జెక్టును బట్టి ప్రశ్నలకు సమాధానాలు ఎంత నిడివిలో, ఎంత చక్కగా రాయాలో ఇప్పటికే మీ ఉపాధ్యాయులు ఎన్నోసార్లు మీతో అభ్యాసం చేయించి ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలలో చేతివ్రాత కు, వ్యాకరణాంశాలకు, అక్షర దోషాలు లేకుండా రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని మీకు తెలుసు. సోషల్ సబ్జెక్టులో మ్యాప్ పాయింటింగ్, సైన్స్ విభాగంలో చక్కటి బొమ్మలు గీసి భాగాలను గుర్తించటం, గణితంలో ఒక క్రమ పద్ధతిలో సమాధానాలు రాబట్టడం వంటి ముఖ్యాంశాలకు తగు ప్రాధాన్యతను ఇవ్వడం అవసరమని గ్రహించండి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు కూడా సమాధానాలను జాగ్రత్తగా ఆలోచించి రాయాలని గ్రహించండి.
పైవిషయాలను చక్కగా పాటించి బోర్డు పరీక్షలను ధీటుగా ఎదుర్కొని మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ చక్కటి ఫలితాలను సాధించబోతున్నారని మనస్ఫూర్తిగా విశ్వసిద్దాం.
                                                             ఆల్ ద బెస్ట్!!
                                                                                                            – సయ్యద్ ఖాసీం అలీ..ఏ జి. యం.
                                                                                                           శ్రీ చైతన్య విద్యాసంస్థలు, హైదరాబాద్
                                                                                                                    9059022889.
Spread the love