– పోరాటాన్ని విరమిస్తున్నట్టు రేడియో ద్వారా ప్రకటన
– అయినా కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయని ప్రభుత్వం
– వినోబా బావే ఆధ్వర్యంలో భూదాన యజ్ఞం
– సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పెన్నా అనంతరామశర్మ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
1948 సెప్టెంబర్ 17న నెహ్రు సైన్యం నిజాం రాష్ట్రంలోకి వచ్చి హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకుంది. సర్దార్ వల్లభారు పటేల్ ముందు నిజాం లొంగి పోయాడు. నిజాం ను రాజ్యాధికారిగా ఉంచుతూ జెఎన్. చౌదరి మిలిటరీ కమాండర్ ను కార్యనిర్వహకుడిగా నియమించాడు. జెఎన్.చౌదరి ఒకవైపు కమ్యూనిస్టులను అణిచేందుకు, ఇంకోవైపు నైజాం మత సంబంధమైన వారిని దాడి చేయడం మొదలైంది. మిలటరీ సహాయంతోటి గ్రామాల్లోకి భూస్వాములు తిరిగి ప్రవేశించి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో కొందరు ఈ భూములు తమవి కావు కనుక వదిలివేశారు. భూస్వాములు గ్రామాల్లో ఉన్నపార్టీ అభిమానులను మిలిటరీకి అప్పగించే పనిలో ముఖ్యపాత్ర వహించేవారు. గ్రామంలో మధ్యతరగతి రైతాంగం వేరుశనగ, పొగాకుపంటలు పండటం ద్వారా ఆర్థికంగా బలపడ్డారు. వారికి భూములు కొనాలంటే కష్టంగా ఉంది. పైగా కమ్యూనిస్టులు ఉంటే భూములు పేదలకు పంచుతారు తప్ప తమకు రాదని ఒక అవగాహనతో కమ్యూనిస్టులను గ్రామాల్లోకి రాకుండాచేసే ప్రయత్నం మొదలైంది. దీనితో దళాలు ఆత్మరక్షణలో పడ్డాయి. పార్టీలో పోరాట విరమణ చేయాలని ఒకరు, సాయుధ పోరాటం సాగించాలనే డిమాండ్ ను మరికొందరు తెర మీదకు తెచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో ముఖ్య నాయకులు తెలంగాణ నగ సత్యాలు అనే కరపత్రం విడుదల చేశారు. ఇది కొంత గందరగోళం సష్టించింది. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. దళాలు ఆత్మరక్షణ కోసం నల్లమల్ల అడవులలోకి, ములుగు, ఆసిఫాబాద్ వైపు కొందరు వెళ్లడం జరిగింది. దీంతో పోరాటం ఆపాల వద్ద అనే చర్చ తీవ్రతరమైంది. అప్పుడు కొందరు పెద్దల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. దానిలో ఎస్‌ఏ డాంగే, బసవ పున్నయ్య, ఈఎంఎస్ లంబోద్రి పాద్, సండ్ర రాజేశ్వరరావు వీరు నలుగురు స్టాలిన్ దగ్గరికి వెళ్లి చర్చలు జరిపినట్లుసమాచారం.వారు తిరిగి వచ్చి కిషన్ డాక్యుమెంట్ పేరా పార్టీ సభ్యులకు పంపారు. చాలామంది పోరాట విరమణ కావాలా వద్దా అని చర్చ జరిగింది. కేంద్ర కమిటీ మెజార్టీ సభ్యులు విరమించాలని నిర్ణయించారు. దాంతో పోరాట విరమణకు సిద్ధమయ్యారు. ఇంకో పక్క భారత ప్రభుత్వం రాజ్యాంగ ఆమోదం పొంది రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. పార్టీలో కొందరు ముఖ్యులు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పోరాటం నిర్వహించారు. దీన్ని ప్రభుత్వ నుండి ఏ హామీ పొందకుండా కనీసం ఆక్రమించిన భూములు పట్టాలు చేయకుండా ఎట్లా విరమిద్దామని చర్చ కొనసాగింది. ఇంకొక వైపు నెహ్రూ మాత్రం పోరాటం విరమిస్తే తప్ప మీతో మాట్లాడేది లేదన్నారు.
కొందరు బాహాటంగా విరమణకు సిద్ధమయ్యారు. ఆత్మరక్షణలో ఉన్న పార్టీ ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, సండ్ర రాజేశ్వరరావు లు పోరాటం విరమణకు సిద్ధపడలేదు. కానీ సామాన్య కార్యకర్తలు చంపబడటం ఆపేదెట్లా అని తర్జనభజన పడి తుదకు 21 అక్టోబర్ 1951 పోరాటం విరమిస్తున్నట్లు పుచ్చలపల్లి సుందరయ్య రేడియో ద్వారా ప్రకటన చేశారు. దాంతోతెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తి వేయలేదు. కానీ ఆంధ్రాలో మాత్రం ఎత్తివేశారు. ఈ మధ్యకాలంలో జెఎన్. చౌదరి నిజాం మతస్థుల పైన చేయించిన దాడులు నెహ్రూ దష్టి కి వచ్చి ఆయనను తొలగించి వెల్లోడిని నియమించారు. వెల్లోడి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు కమ్యూనిస్టులపై ఎక్కువగా జరిగాయి. ఇంకో పక్కన రక్షిత కౌలుదార్ల చట్టం తెచ్చి ఆరు సంవత్సరాలకు ఎవరి భూమినైనా కాస్తు చేస్తే వారిని ఇష్టం లేకుండా తొలగించే ప్రయత్నం చేశారు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఆర్డీవో అనుమతిని ఇస్తేనే జరిగేది. దాంతో భూములను అమ్మడం కష్టమైంది. దీనికి విరుగుడుగా కోర్టులోఎవరి పేరు మీద అయితే భూమి ఉందో వారు కోర్టుకు వెళ్లి ఈ భూమికి నాకు సంబంధం లేదు. అని ఒప్పుకోలు డిగ్రీ చేస్తే ఆ భూమి ఎవరైతే కొనుక్కున్నారో వాని పేరు మీద మారేది. దీంతో గ్రామాలలో భూముల అమ్మకం ఎక్కువైంది. భూస్వాములు భూముల అమ్ముకొని నగరాలలో ఇళ్ల స్థలాలు, సేద్య భూములు వదిలిపెట్టి పాకిస్తాన్ కి వెళ్ళిపోయిన వారి భూములను కారు చౌకగా కొని పట్టణాలలో కోట్ల ఆస్తులు పెంచుకున్నారు. ఈ దశలో వినోబా భావే తెలంగాణకు వచ్చి భూస్వాముల దగ్గర అడిగి భూమి తీసుకొని దాని పేదలకు పంచే కార్యక్రమం మొదలుపెట్టాడు. దాన్ని భూదాన యజ్ఞంగా ప్రచారం చేశారు. ఇక పోరాటం తో పనిలేదు. భూస్వాములే భూములు వదిలిపెడుతున్నారని ప్రచారం మొదలైంది.