– ఆశాలకు పరీక్షపై సీఐటీయూ
– ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– ఇతర సమస్యలను పరిష్కరించాలి:
– వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఆశా యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆశాలకు నష్టం కలిగించే పరీక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (ఆశా) యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో ఆశాలకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేసింది. పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌లో ఏఎన్‌ఎం ప్రమోషన్ లాంటి సౌకర్యాలు లేవని తెలిపింది. ఆశాలు తమ పనికి సంబంధించి జ్ఞాపకశక్తిని నిరూపించుకుంటే ఒక సర్టిఫికెట్‌కు రూ.5 వేలు ఇస్తామని పేర్కొందని గుర్తుచేశారు. సుదీర్ఘకాలం చేసిన పనిని, వారు చేస్తున్న డిమాండ్లను గుర్తించకుండా రూ.5 వేలు భిక్షం వేస్తామనడం అన్యాయమని విమర్శించింది. పైపెచ్చు పరీక్ష రాసి ఫెయిల్ అయిన వారినీ, ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉన్న ఆశాలను ప్రభుత్వం తొలగించే ప్రమాదం ఉందంటూ ఆశాలు భయపడుతున్నారని తెలిపింది. ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి, రాష్ట్ర నాయకులు టి.యాదమ్మ బుధవారం కోఠిలోని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కర్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. గిరిజన ప్రాంతాల్లో 33 ఏండ్లుగా, మైదాన ప్రాంతాల్లో 19 ఏండ్లుగా ఆశావర్కర్లు పని చేస్తున్నారని గుర్తుచేశారు. వారికి ఇస్తున్న పారితోషికాలను రూ.18 వేలకు పెంచి, ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా రెండో తేదీన పారితోషికాలు చెల్లించాలనీ, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. ఆశాలకు మట్టి ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలనీ, ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్టర్లను ప్రింట్ చేసి ఆశాలకు అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.