ఆ ప్ర‌పంచ‌మే అమాన‌వీయం

That world is inhumanసినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందరినీ ఆకర్షించే రంగం. ఒక్కసారి స్క్రీన్‌పై కనిపిస్తే చాలని కోరుకునే వారు ఎందరో. అందుకే అవకాశాల కోసం వస్తున్న మహిళలపై లైంగిక దాడులు ఎక్కువైపోయాయి. తమపై జరుగుతున్న లైంగిక దోపిడీని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్న నటీమణులు ఎందరో. అటువంటి పరిశ్రమ లో మహిళల రక్షణను పరిశీలించేందుకు కేరళ ప్రభుత్వం ముందు కొచ్చింది. మలయాళ చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదించిన అంశాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సినీ మాఫియా గుట్టు బయట పెట్టాయి.
2017లో నమోదైన ఓ కేసు ఆధారంగా మలయాళ చిత్రసీమలో మహిళా కళాకారులు ఎదుర్కొంటున్న వేధింపులను పరిశీలించడానికి కేరళ ప్రభుత్వం జస్టిస్‌ కె.హేమ అధ్యక్షత ఓ ప్యానెల్‌ను నిమయించింది. ఆ కమిటీ తమ నివేదికను 2019లో అందించింది. అయితే అందులోని విషయాలు బహిర్గతం చేయాలంటూ కొన్ని డిమాండ్లు రావడంతో ఇటీవలె ఆ కమిటీ తన నివేదికను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేసి తీసుకోవల్సిన చర్యలు, జాగ్రత్తలను కూడా తెలిపింది.
సెక్స్‌ కోసం అందుబాటులో ఉండాలి
పరిశ్రమలోకి అడుగుపెట్టగానే మహిళలపై వేధింపులు కూడా మొదలవుతాయని నివేదికలో స్పష్టంగా ఉంది. కమిటీ పరిశీలన ప్రకారం ఒక పాత్ర కోసం సంప్రదించే స్త్రీ ‘సర్దుబాట్లు చేసుకోవాలి, రాజీ పడాలి’ అని అందులో పేర్కొన్నారు. వారు కోరినప్పుడు మహిళా కళాకారులు సెక్స్‌కు అందుబాటులో ఉండాలి. కొంతమందైతే కొన్ని వీడియో క్లిప్‌లు, ఆడియో క్లిప్‌లు, సినిమాల్లోకి ప్రవేశించిన స్క్రీన్‌షాట్‌లను కూడా చూపించారు. సినీరంగంలో ఈ పరిస్థితికి స్వస్తి పలకాలని పలువురు మహిళలు కమిటీ ముందు గట్టిగా చెప్పారు. కొందరు వారి కోర్కెలు తీర్చేందుకు ఒప్పుకోనందుకు సినిమాల్లో నటించాలనే తమ చిరకాల స్వప్నాన్ని కోల్పోవలసి వచ్చింది. పరిశ్రమలోని ప్రసిద్ధ వ్యక్తుల నుండి కూడా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని కమిటీ తన నివేదిక పేర్కొంది. చాలా మంది ఆర్టిస్టులు సెట్స్‌లో దగ్గరి బంధువులు లేదా తల్లిదండ్రులతో కలిసి ఉంటాల్సి వస్తుంది. ఎందుకంటే పాత్ర కోసం ఆఫర్‌తో పాటు సెక్స్‌ కోసం డిమాండ్‌ కూడా వస్తుంది. అందుకే వారు కార్యాలయంలో తమ భద్రత గురించి భయపడుతున్నారు. వారు బస చేసిన హోటళ్లలో, సినీ రంగానికి చెందిన వ్యక్తులు తాగిన మత్తులో వారి తలుపులు తట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని నివేదికలో తెలిపారు.
అమానవీయ పని పరిస్థితులు
షూటింగ్‌ లొకేషన్లలో టాయిలెట్లు కానీ, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి సౌకర్యాలు వుండవు. ‘సెట్‌లో టాయిలెట్‌ సౌకర్యం, దుస్తులు మార్చుకునే గది లేదు. ముఖ్యంగా చాలా వరకు షూటింగ్‌లు అవుట్‌డోర్‌ లొకేషన్‌లలో జరుగుతుంది. అప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు’ అంటూ దాదాపు కమిటీ ముందు మాట్లాడినా ప్రతి మహిళా పేర్కొన్నట్టు నివేదికలో ఉంది. అలాంటి ప్రదేశాలలో మహిళలు ఏకాంత ప్రదేశాల కోసం వెతికేవారు. పొదలు వెనుక్కు వెళ్ళి తమ అవసరాలు తీర్చుకునేవారు. కొన్నిసార్లు ఇతరులు తమ చుట్టూ గుడ్డతో పట్టుకుంటే బట్టలు మార్చుకునేవారు.
చట్టవిరుద్ధమైనా…
టాయిలెట్లు అందుబాటులో లేక చాలా మంది సెట్‌లో నీరు తాగడం లేదు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇదంతా తెలిసినా ఈ సమస్యల నుండి బయటపడే అవకాశం తమకు లేదని కూడా అన్నారు. అయితే ఈ సమస్య కేవలం నటీమణులకే కాకుండా జూనియర్‌ ఆర్టిస్టులు, స్టైలిస్ట్‌ల వంటి సహాయక సిబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. నటీమణుల ప్రత్యేక ఉపయోగం కోసం మాత్రమే క్యారవాన్‌లు అందించబడ్డాయి. ఒక ప్రముఖ నటుడు చెప్పిన ప్రకారం మలయాళ సినిమాల్లో శక్తివంతమైన మాఫియా గురించి కూడా నివేదికలో పొందుపరిచారు. ‘వారు తమ ఇష్టాయిష్టాలు, అభిరుచుల ప్రకారం సినిమాల్లో ఏదైనా చేయగలరు. అలాంటివి చట్టవిరుద్ధం, అనధికారికమైనప్పటికీ ప్రముఖ దర్శకులు, నిర్మాతలు వీటికి పాల్పడుతున్నారు’ అని నివేదిక పేర్కొంది.
స్వతంత్ర ఫోరమ్‌ అవసరం
సాధారణంగా అన్యాయాల గురించి బహిరంగంగా మాట్లాడే మహిళలు కూడా తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను బహిర్గతం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవకాశాలు రావనే భయంతో పాటు మరిన్ని వేధింపులకు గురవుతామనే ఆందోళన వారిని వెనకడుగు వేసేలా చేస్తుంది. ‘సోషల్‌ మీడియా నుండి కూడా వారిపై తీవ్రమైన ఆన్‌లైన్‌ వేధింపులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో వారికే కాక సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఎదుర్కోవలసి వస్తుందని కమిటీలో కొందరు పంచుకున్నారు. ఇవన్నీ పరిశీలించిన కమిటీ తన నివేదికలో చట్టంలోని నిబంధనల ప్రకారం సినిమా రంగంలో ఐసిసిని ఏర్పాటు చేయగలిగినప్పటికీ అది మహిళలకు ఎటువంటి సహాయం చేయదని, పైగా దీనివల్ల వారికి మరింత హాని కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలో స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా ఒక స్వతంత్ర ఫోరమ్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. అప్పుడే ఈ రంగంలోని మహిళలకు లైంగిక వేధింపుల నుండి విముక్తి లభిస్తుందని మలయాళ చిత్ర పరిశ్రమ కూడా అభిప్రాయపడింది.
తెలంగాణలో కూడా అవసరం
వాస్తవానికి ఈ సమస్య ఒక్క మలయాళ చిత్ర పరిశ్రమదే కాదు. దేశం, ప్రపంచంలోనే సినీ రంగంలోని మహిళా కళాకారులు లైంగిక దోపిడినీ ఎదుర్కొంటున్నారు. 2016లో జరిగిన మీటూ ఉద్యమమే దీనికి ఓ ఉదాహరణ. ఏది ఏమైనా మాట్లాడేందుకే భయపడే పరిశ్రమలో మహిళా భద్రత గురించి చర్చించి కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ స్ఫూర్తితో కేరళలో మాదిరిగా తెలంగాణ సినీ పరిశ్రమలోని మహిళల రక్షణ కోసం కూడా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమంత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ట్విట్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ లాగే టాలివుడ్‌లో కూడా సపోర్ట్‌ గ్రూప్‌ ది వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌ నడవాలి. దీన వల్ల సురక్షితమైన వాతావరణంలో మహిళలు పని చేసేందుకు అవకాశం దొరుకుతుందని ఆమె ట్విట్‌ చేశారు.

Spread the love