పరకాల–హనుమకొండ ప్రధాన రహదారిపై బీజేపీ ధర్నా
నవతెలంగాణ – పరకాల
పరకాలలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల–హనుమకొండ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, పరకాల మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అంతకుముందు బీజేపీ నాయకులు పరకాల ప్రభుత్వ సీహెచ్‌సీ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వైద్య పరికరాలు, మందుల లభ్యత, వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా అనే విషయాలను పరిశీలించడంతో పాటు చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా “100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి”, “ఎమ్మెల్యే డౌన్ డౌన్”, “బీజేపీ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత, మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదని, కనీస వైద్య సేవలు మాత్రమే కోరుతున్నారని అన్నారు. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్, ప్రయోగశాల సేవలు, మహిళా వైద్యులు రాత్రి విధులు నిర్వహించేందుకు అవసరమైన వసతులు కల్పించి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ పరకాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన విమర్శించారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో పరకాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
నర్సంపేట, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో వైద్య కళాశాలలో నిర్మాణంతోపాటు వైద్య సదుపాయాలు విస్తరించగా, పరకాలలో మాత్రం నూతన ఆసుపత్రి ప్రారంభం కూడా కాలేదని విమర్శించారు.రెండు నెలల్లోగా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు 9 వాటర్ మున్సిపల్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతులాల్, పాలకుర్తి తిరుపతి, దగ్గు విజేందర్ రావు, కార్యకర్తలు సుమారు 40 మంది పాల్గొన్నారు.



