మీడియాలో వచ్చిన ఆరోపణలు నిజం కావు

మీడియాలో వచ్చిన ఆరోపణలు నిజం కావు– ‘ఉపా’ కేసును తోసిపుచ్చిన ‘న్యూస్‌క్లిక్‌’
– ఎనిమిది వేల పేజీలతో ప్రబీర్‌పై చార్జీషీటు దాఖలు
– ఏప్రిల్‌ 16కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసు గురించి మీడియాలో ప్రచురించిన ఆరోపణలను ‘న్యూస్‌క్లిక్‌’ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ” మేము అనేకసార్లు పునరుద్ఘాటించినట్టుగానే.. న్యూస్‌క్లిక్‌, చైనా లేదా చైనీస్‌ సంస్థల నుంచి ఎలాంటి నిధులూ, సూచనలను స్వీకరించలేదు. ఏ ‘దేశ వ్యతిరేక’ చర్యలోనూ పాల్గొనలేదు, ప్రోత్సహించలేదు” అని స్పష్టం చేసింది. ”వివిధ ప్రభుత్వ సంస్థలు న్యూస్‌క్లిక్‌పై పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేశాయి. కానీ, వారు ఎలాంటి సాక్ష్యాలనూ అందించలేకపోయారు. తాజా వాదనలు కూడా భిన్నంగా లేవు. న్యూస్‌క్లిక్‌ పని అంతా పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నది. న్యూస్‌క్లిక్‌పై వచ్చిన ఆరోపణలు మన స్వతంత్ర జర్నలిజాన్ని మట్టుబెట్టేలా ఉన్నాయని నిర్ధారించడానికి క్లుప్త పరిశీలన సరిపోతుంది. విచారణ సమయంలో ఇటువంటి ఆరోపణలు కొట్టివేయబడతాయని మేము విశ్వసిస్తున్నాము. మన పని నిరూపితమవుతుంది” అని వివరించింది. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఎనిమిదివేల పేజీలతో చార్జీషీటు దాఖలు చేశారు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ అదనపు సెషన్స్‌ జడ్జి హర్దీప్‌ కౌర్‌ ముందు తుది నివేదికను దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌16కి వాయిదా వేసింది.

Spread the love