Tuesday, July 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఫెర్టిలైజర్ యాప్ డీలర్ల లీలలు

ఫెర్టిలైజర్ యాప్ డీలర్ల లీలలు

- Advertisement -

రైతులు రాకముందే యూరియా ధ్రువీకరణ.. మరోకరికి విక్రయం?
మూడు రోజుల గడువును ఆసరాగా చేసుకుని అక్రమాలు చేస్తున్నారన్న రైతుల ఆరోపణల
నవతెలంగాణ – సిర్పూర్ (టి)

రైతులకు సబ్సిడీపై యూరియా ఎరువులు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ అమలులో క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రూపొందించిన ఈ విధానాన్ని కొందరు ఎరువుల డీలర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఫెర్టిలైజర్ యాప్ ద్వారా రైతు యూరియా బుక్ చేసుకున్న వెంటనే అతని మొబైల్ నంబర్‌కు ప్రత్యేక ఐడీ (టోకెన్) జారీ అవుతుంది. ఆ ఐడీ ఆధారంగా సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి యూరియాను తీసుకోవాల్సి ఉంటుంది. యాప్ నిబంధనల ప్రకారం రైతు బుక్ చేసుకున్న యూరియాను మూడు రోజులలోపు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు మూడు రోజుల గడువులో యూరియా తీసుకోకపోతే, ఆ బుకింగ్ రద్దై సంబంధిత పరిమాణం తిరిగి రైతు ఖాతాలో జమ అవుతుంది.

అయితే ఈ మూడు రోజుల వ్యవధినే కొందరు డీలర్లు తమ అక్రమాలకు ఆసరాగా మార్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు దుకాణానికి చేరుకోకముందే, రైతు అనుమతి లేకుండా, అతనికి వచ్చిన ఐడీని ఉపయోగించకుండానే లేదా సరైన ధ్రువీకరణ లేకుండానే యాప్‌లో యూరియా పంపిణీ చేసినట్లు నమోదు చేస్తున్నారని చెబుతున్నారు. అనంతరం అదే యూరియాను ఇతర వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దీంతో రైతు దుకాణానికి వెళ్లినప్పుడు యాప్‌లో ఇప్పటికే యూరియా పంపిణీ చేసినట్లు కనిపిస్తుండటంతో తాను బుక్ చేసుకున్న ఎరువును పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే యాప్‌లో పంపిణీ పూర్తయిందని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది రైతుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో బంధువులు, స్నేహితులు లేదా ఇతర రైతుల సహాయంతో యూరియా బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చుకుని రైతుల హక్కులను కాలరాస్తున్నారని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ యాప్ లక్ష్యం క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని, కొందరు డీలర్ల అక్రమాలను అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. రైతు స్వయంగా దుకాణానికి వచ్చి యూరియా స్వీకరించిన తర్వాత మాత్రమే యాప్‌లో ధ్రువీకరణ జరిగేలా సాంకేతిక మార్పులు చేయాలని, రైతు అనుమతి లేకుండా ముందస్తు ధ్రువీకరణ జరగకుండా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని వారు కోరుతున్నారు.

అలాగే ఫెర్టిలైజర్ యాప్‌లో నమోదైన ప్రతి లావాదేవీపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించి, రైతుల పేరిట అక్రమ ధ్రువీకరణలు చేసినట్లు తేలితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -