– మండల ఇన్చార్జ్ ఏవో డీఎన్కే శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించేందుకు రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని మండల ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి డీఎన్కే శ్రీనివాసరావు కోరారు. వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కుంటల్లో నిల్వ ఉంచిన నీటిని అత్యవసర సమయంలో పంటలకు అందించి, ఎండకాలంలో వచ్చే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. దీని వల్ల పంట దిగుబడులు మెరుగుపడటమే కాకుండా, భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన వివరించారు. అలాగే ఈ నీటి కుంటలు చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు తమ నీటి అవసరాలకనుగుణంగా ఈ కుంటలను మూడు రకాల పరిమాణాల్లో నిర్మించుకోవచ్చని ఏవో పేర్కొన్నారు
15 × 15 × 3 మీటర్లు,
20 × 20 × 3 మీటర్లు
25 × 25 × 3 మీటర్లలో ఈ నీటి కుంటల నిర్మాణాలకు ప్రభుత్వం పూర్తి రాయితీ అందిస్తోందని ఆయన తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి, 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని ఏఓ స్పష్టం చేశారు. ఆసక్తి గల అర్హులైన రైతులు తమ గ్రామ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించి, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జ్ ఏవో శ్రీనివాసరావు రైతులను కోరారు.



