నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో నిపుణుల మధ్య నిర్వహణా సామర్థ్యాలను పెంచేలా కలిసి పనిచేయాలని ఫారిన్ ఎక్సేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఈడీఏఐ-ముంబై), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు పరస్పర ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను సంయుక్తంగా రూపొందించడం, సెమినార్లు, సమావేశాలు, పరిశోధనల కోసం అధ్యాపకుల వనరులను పంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీ మారకం, ట్రెజరీపై తమ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ ఒప్పందం మూడేండ్లు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు. ఈ ఒప్పందంపై ఆస్కీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్య బాగ్చి, ఫెడారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్వని సింధ్వాని సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ (ఫారెక్స్) శ్రీనివాస పాణిగ్రాహి, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ వల్లి మాణికం తదితరులు పాల్గొన్నారు.