సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కీసర
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కాలనీల్లోని వాణిజ్య సముదాయాలను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 16 డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో ఉన్న 992 వాణిజ్య సముదాయాలను వేలం పాట ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. గత ప్రభుత్వం కాలనీల నిర్వహణ కోసం ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకు వాణిజ్య సముదాయాలను నిర్మించిందని గుర్తు చేశారు.
వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని లిఫ్టులు, ఇతర నిర్వహణ పనులకు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు వాటిని విక్రయిస్తే నిర్వహణ ఖర్చులు ప్రజలపై పడతాయని అన్నారు. అందుకని తక్షణం వేలం ఆపాలని కోరారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ కాలనీలలో అంగన్‌వాడీ, వైద్య, విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డ్రయినేజీ, లిఫ్టు, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. కాలనీలలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మురారిపల్లి తదితర డబుల్ బెడ్‌రూమ్ కాలనీలకు తక్షణమే మంచినీటి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి అప్పగించాలని కోరారు. సమస్యలపై ప్రజలందరూ స్పందించి ఉద్యమించాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి వాణిజ్య సముదాయాల విక్రయాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తమ పార్టీ తరఫున రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రికి బహిరంగ లేఖ రాయనున్నట్టు చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. షాపుల ద్వారా వచ్చే ఆదాయంకన్నా ప్రభుత్వమే అదనంగా ఆదాయం కేటాయించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మను చౌదరికి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వానికి, హౌసింగ్ బోర్డ్ అధికారులకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వినోద, అశోక్, జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, లింగస్వామి, నరేష్, సబిత, వెంకన్న, పార్టీ నాయకులు గణేష్, నర్సింగ్‌రావు, బాల పీర్, విజయ్, శ్రీనివాస్, ఆంజనేయులు, సురేష్ పాల్గొన్నారు.



