కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలి

The autocratic policies of the central government should be opposed– రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-వైరాటౌన్‌
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిం చాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వైరా రూరల్‌, వైరా టౌన్‌, కొణిజర్ల మండలాల సంయుక్త సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో వ్యకాస వైరా మండలం కార్యదర్శి తూము సుధాకర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. పేదలు తినే ఆహారం మీద ఆంక్షలు పెడుతుందని, పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలు నీరు కార్చి సంపన్నులకు ఊడిగం చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే నూటికి 60 శాతం వ్యవసాయ ఆధారంగా పనిచేస్తున్న చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు పని లేకుండా చేయడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టంలో నూతన జీవోల ద్వారా రెండు పూటలా పని పద్ధతులు ప్రవేశపెట్టిందని, డ్రోన్‌ సిస్టం ద్వారా పని పర్యవేక్షిస్తూ రోజు కూలి 150 రూపాయలకు మించి ఇవ్వటం లేదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి రద్దు చేసిన సమ్మర్‌ అలవెన్సులను పునరుద్ధరించాలని, రోజు కూలి కేరళ తరహాలో 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన మంచినీళ్లు, మెడికల్‌ కిట్టు, టెంట్లు ఏర్పాటు చేయాలని, బిజెపి అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఉపాధికి ఏటేటా బడ్జెట్‌ తగ్గిస్తూ కూలీల సంఖ్యను కుదిస్తుందని, కేంద్ర బడ్జెట్లో మూడు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తదితర డిమాండ్ల సాధన కోసం ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడాలని, ఏప్రిల్‌ 14న రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్‌ జయంతి గ్రామ గ్రామాన జరపాలని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి బిజెపి తెచ్చిన పెను ప్రమాదాన్ని దళితులు, పేదలందరికీ తెలియజేయాలని సూచించారు. ఉపాధి సమస్యలు పరిష్కారం కోసం ఏప్రిల్‌ 21న ఖమ్మంలో జరుగు జిల్లా స్థాయి సదస్సుకు ఉపాధి మెట్లు, వాచర్లు, కూలి మేస్త్రిలు హాజరుకావాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌, మున్సిపల్‌ పట్టణాలలో కూడా ఉపాధి పనులు ప్రవేశపెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు, సాగు భూములు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యకాస సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ, సంఘం జిల్లా నాయకులు చింతపల్లి ప్రసాద్‌, బోలమాల యోహాను, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్‌, తోట నాగేశ్వరరావు, షేక్‌ రెహనా, షేక్‌ మజీద్‌ బి, ఎస్‌కే ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
బోనకల్‌: బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలతో దేశ ప్రయోజనాలకు ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన పార్టీ మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తమ భుజస్కందాలపై వేసుకోవాలని కోరారు. సాగునీటి సమస్యతో ఎండిపోయిన మొక్కజొన్న పంటకు పరిహారం చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాగా ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ప్రకటించి అర కొర పరిహారం అందించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా కాకుండా ఎకరానికి 25 వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలగా జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని, కానీ నేటికీ ఉపాధి హామీ కూలీలకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడారు. పార్టీ మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, గుడిపూడి వెంకటేశ్వరరావు, కిలారి సురేష్‌, నోముల పుల్లయ్య, ఏడునూతల లక్ష్మణరావు, చిట్టిమోదు నాగేశ్వరరావు, కందికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love