Tuesday, April 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీది మనువాద సిద్ధాంతం

బీజేపీది మనువాద సిద్ధాంతం

- Advertisement -

మహిళలకు ప్రాధాన్యత ఉండదు
బొందల పడ్డట్టు ప్రజల పరిస్థితి
సీఎం, మంత్రులను చూస్తే జాలేస్తుంది
కోటి ఎకరాలు కబ్జా చేసే యత్నం
తెలంగాణ వారియర్స్‌ తయారు కావాలి
సభ్యత్వాన్ని పట్టించుకోకుంటే
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకూ టికెట్‌ ఇవ్వను
సంస్థాగతంగా పార్టీబలోపేతం కావాలి : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీజేపీది మనువాద సిద్ధాంతమని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండబోదని అన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తుందన్నారు. లోక్‌సభలో 2/3 మెజార్టీ లేకున్నా మహిళా బిల్లును, డీలిమిటేషన్‌కు ముడిపెట్టిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. బొందల పడ్డట్టు ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చాతకావడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను చూస్తే గుండె తరుక్కుపోతున్నదని చెప్పారు. చిల్లర మాటలు మాట్లాడే సీఎం, మంత్రులను చూస్తే జాలేస్తోందని అన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదని చెప్పారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఒక వెధవ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో ఉంటే పార్లమెంటులో రణరంగం సృష్టించే వాళ్లని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఒక్కరూ కూడా స్పందించలేదని చెప్పారు. తెలంగాణ అడ్డగోలుగా, అవమానకరంగా మాట్లాడినా ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. సీఆర్‌ పాటిల్‌ కాళేశ్వరం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేశ్‌రెడ్డి గట్టిగా ఖండించారని గుర్తు చేశారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదనీ, వారు మనుషులు కాదా?అని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉండేది బీఆర్‌ఎస్‌ నేతలకేనని ఇప్పటికైనా అర్థమైందన్నారు.

ఒకప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌
ఒకప్పుడు వ్యవసాయం నుంచి అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలబెట్టామని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం భూముల కబ్జాల్లో, ఇండ్లను కూలగొట్టడంలో నెంబర్‌వన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కోటి ఎకరాలను నిషిద్ధ జాబితాలో పెట్టి భూముల కబ్జాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పాల్పడుతున్నదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న దయనీయ వ్యవసాయ పరిస్థితి రాష్ట్రంలో మళ్లీ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయం, రైతాంగం సంక్షోభం దిశగా పోతున్నాయని వివరించారు. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ తీసుకునే అంశంలో కొంత రాజీపడాలని సోనియాగాంధీ అనేకసార్లు సూచించారని అన్నారు. రాజీపడేది లేదని చెప్పామనీ, అందుకే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణకు రక్షణ కవచంలాంటి క్యాడర్‌ కావాలని అన్నారు. తెలంగాణ వారియర్స్‌ తయారు కావాలని చెప్పారు. నూతన కమిటీలు వేసి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థి కమిటీలు ఉండేలా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా 200 మందితో కమిటీ వేసి శిక్షణా తరగతులను ప్రారంభించాలని సూచించారు. సభ్యత్వ ప్రక్రియ కోసం ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగిస్తామన్నారు. పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినా టికెట్‌ ఇవ్వబోనని హెచ్చరించారు. తాను ఒకసారి చెబితే వెయ్యిసార్లు చెప్పినట్టేనని అన్నారు. టికెట్‌ కేటాయింపునకు సభ్యత్వ నమోదు ప్రామాణికమని స్పష్టం చేశారు. బీఎల్‌ఏ జాబితా ఇవ్వని ఎమ్మెల్యేలు, నాయకులపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి ఇంకా జాబితా రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సరిగ్గా చేయని వారు భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా ఏం చేస్తారని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో ఉంటే సరిపోదనీ, ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -