వృద్ధాప్య భారం..?

The burden of old age..?– అనారోగ్యంతో అవస్థలు
– డబ్బులు లేక ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి
– ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు అంతంత మాత్రమే..
– ఏజ్‌ వెల్‌ సంస్థ సర్వేలో వెల్లడి
నవతెలంగాణ-ఎల్‌బీనగర్‌
వృద్ధాప్యం భారంగా మారుతోంది.. అత్యధిక కుటుంబాల్లో వయోధికుల ఆరోగ్యం పట్ల ఆదరణ కరువవుతోంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతోపాటు.. వయసుతోపాటు మీదపడే వ్యాధులకు తోడు అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు వృద్ధాప్యాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. దేశంలో వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది.
వారు వివిధ అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక, ప్రయివేటు దవాఖానాలకు వెళ్లడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఏజ్‌ వెల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని వృద్ధుల పరిస్థితిపై ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా పదివేల మందికి పైగా వృద్ధులపై ఏజ్‌ వెల్‌ అనే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో సర్వే చేపట్టి రిపోర్టును బహిర్గతం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 5,259 మంది వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో 4,741 మంది వృద్ధులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
24 శాతం మంది వృద్ధులకు కుటుంబ సభ్యుల ఆదరణ కరువవైంది. కుటుంబ సభ్యులు దూరంగా ఉండటంతో వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వృద్ధుల్లో 38.5 శాతం మంది తమ ఆరోగ్యం బాగాలేదని, అనేక సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని 54.6 శాతం మంది వృద్ధులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సంస్థ వెల్లడించింది.
ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న మన దేశంలో ప్రభుత్వాలు అందించే వైద్యం అంతంత మాత్రమే. ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నది.
దాంతో వృద్ధులు పుట్టెడు రోగాలతో మంచానికే పరిమితమవు తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ దవాఖానాలకు ఖర్చు పెడుతున్న నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పేదలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని సర్వేలో తేలింది. కార్పొరేట్‌ ఆస్పత్రులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానలకు సరైన నిధులు ఇవ్వడం లేదు.
పట్టణాల్లో 48.6, గ్రామాల్లో 62 శాతం..
ఏజ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో పట్టణాల్లో 48.6 శాతం, గ్రామాల్లో 62 శాతం మంది వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నా ఆస్పత్రులకు వెళ్లడం లేదు. ఇదిలా ఉండగా, ఓ వైపు తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనారోగ్య సమస్యలతో వృద్ధులు బాధపడుతున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి వదిలేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 48.6 శాతం మంది వృద్ధులు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా దవాఖానకు వెళ్లడం లేదు. అందుకు ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులేనని తేలింది. గ్రామాల్లో వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పల్లెల్లో 62 శాతం మంది వృద్ధులు ఆస్పత్రుల దరిదాపులకు కూడా వెళ్లడం లేదని సర్వేలో వెల్లడైంది.

Spread the love