కారుదే గెలుపు

The car is a win– మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం
– గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. దాంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 28న నిర్వహించిన ఈ ఉప ఎన్నికలో.. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు బీజేపీ దూరంగా ఉన్నది. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్య బీఆర్‌ఎస్‌ వైపు అధికంగా ఉండడం చేత ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 1439 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్‌ఎస్‌కు 763, కాంగ్రెస్‌ అభ్యర్థికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్‌ గౌడ్‌కు ఒక్క ఓటు వచ్చింది. ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు 50 శాతానికి ఒక్క ఓటు అధికంగా వచ్చినా గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ కుమార్‌ రెడ్డికి 111 ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే ఎమ్మెల్సీ గెలుపుపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డిని పోటీలో నిలిపారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన మన్నె జీవన్‌ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం, ఇక్కడ ఓడిపోతే అప్రతిష్ట పాలవుతామన్న కారణంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా, గెలుపు కోసం రాజకీయ పార్టీలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు రాజకీయాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు ముట్ట చెప్పారని ప్రచారం జరిగింది. డబ్బు, అధికార ప్రభావం వల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుస్తాడని అందరూ ఊహించారు. కానీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థి గెలుపులో ప్రధాన భూమిక పోషించారు.

Spread the love