ఆర్డీఎస్‌లో పూడిక తీయాలి..
రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై రాజీ లేదు
ఏపీ, కర్నాటకతో చర్చలకు సిద్ధం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌తో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు హక్కుగా రావాల్సి ఉండగా, అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్ట్, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి ఈ .శ్రీధర్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని చెప్పారు. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సారథ్యంలో తుంగ భద్ర బోర్డును పటిష్టం చేయాలని కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందనీ, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని కర్నాటకను కోరారు. కాల్వల ఆధునీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందనీ, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. ప్యాకేజీ 1,2 పనులు చేపట్టలేదనీ, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తి అయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో గురువారం కర్నాటకలో ముగ్గురు సీఎంలతో జరిగే సమావేశంలో ప్రస్తావించనున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్ వద్ద పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన విధంగా నీటి మళ్ళింపు సాధ్యం
(మొదటి పేజీ తరువాయి)
కావడం లేదనే విషయాన్ని ఇంజినీర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 2004 లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించినా, ఇప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు అమలు కాలేదని వివరించారు. ఆర్డీఎస్‌లో పేరుకు పోయిన పూడిక కర్నాటక భూభాగంలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరనున్నట్టు సీఎం తెలిపారు. పూడికతీతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని అధికారులకు సూచించారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని సీఎం అదేశించారు. తుంగభద్ర నీటి వాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తుంగభద్రపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



