జాతరలో కొబ్బరి, బెల్లం, లిక్కర్, షాపులను గిరిజన అభ్యుదయ సంఘానికే ఇవ్వాలి

– మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజారావు
నవతెలంగాణ-తాడ్వాయి :
ఫిబ్రవరిలో జరుగు మేడారం మహా జాతరకు ఆదివాసి సంఘాలకు, తుడుందెబ్బ సంఘాలకు ఇచ్చే కొబ్బరి, బెల్లం, లిక్కర్ షాపులను మా స్థానిక మేడారం, గిరిజన అభ్యుదయ సంఘానికి ఇవ్వాలని “గిరిజన అభ్యుదయ సంఘం” అధ్యక్షుడు సిద్ధబోయిన బోజారావు అన్నారు. సోమవారం మేడారంలోని ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు, అర్చకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన బోజారావు మాట్లాడుతూ గత జూన్, జూలై మాసాలలో వర్షాలు అధికంగా కురవడంతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం జలమయంగా మారి స్థానికంగా ఉన్న ఆదివాసి గిరిజన కుటుంబాలు మొత్తం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాయన్నారు. పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. ఈ సందర్భంలో ఏ ఒక్క ఆదివాసి గిరిజన, తుడుం దెబ్బ సంఘాలు స్థానికంగా మేడారంలో ఉన్న కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జాతర వచ్చిందంటే ఎక్కడెక్కడి ఈ సంఘాలు మాకు షాపులు కావాలంటే మాకు షాపులు కావాలని డిమాండ్ చేస్తారని మండిపడ్డారు. మేడారంలో అన్ని రకాలుగా జాతర సమయంలో దుర్వాసనలకు గురై రోగాల బారిన పడి, వరదలలో కొట్టుకొని పోయి అన్ని రకాలుగా నష్టపోయిన స్థానిక ఆదివాసీ కుటుంబాలకు మేడారంలోని గిరిజన అభ్యుదయ సంఘానికి కొబ్బరి, బెల్లం, లిక్కర్ షాపులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు (ఐటీడీఏ పీవో, కలెక్టర్) వినతిపత్రం అందించినట్లు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి స్థానికంగా ఉన్న గిరిజన అభ్యుదయ సంఘానికి మేడారం జాతరలో కొబ్బరి బెల్లం లిక్కర్ షాపులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, చంద రఘుపతి, చంద గోపాలరావు, కాక వెంకటేశ్వర్లు, వెనక ప్రభాకర్, రాజేశ్వరరావు, చంద కళ్యాణ్ కొక్కెర పూర్ణచందర్, సిద్దబోయిన రానా రమేష్, పరమయ్య అర్చకులు, గిరిజన అభ్యుదయ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love