రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె

– టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె మంగళవారం నుంచి ప్రారంభమైందని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ) తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమ్మె నోటీస్‌లో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు రాత పరీక్షను రద్దు చేయాలనీ, ప్రస్తుతం పని చేస్తున్న వారందరినీ యధావిధిగా రెగ్యులర్‌ చేయాలనీ, ఇతర అన్న సమస్యలను పరిష్కరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేసింది. లేకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెలోకి వెళ్తామని సమాచారమిచ్చి 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్టు వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సమ్మెలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ… రేపటి నుంచి 33 జిల్లాల్లో సమ్మెను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌,
వరంగల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదా నాయక్‌, నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర అధ్యక్షులు ఎండి.ఫసియుద్దీన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఐటీయూ సహాయ కార్యదర్శి డి.వీరన్న, నిజామాబాద్‌ జిల్లాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌, ములుగు జిల్లాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జే సుధాకర్‌, మంచిర్యాల జిల్లాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, అదిలాబాద్‌ జిల్లాలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నవీన్‌ కుమార్‌, కరీంనగర్‌ జిల్లాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌ మిగత జిల్లాల్లో స్థానిక సీఐటీయూ, మెడ ికల్‌ అండ్‌ హెల్త్‌ నాయకులు పాల్గొని సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు.
సమ్మెలోకి రండి : యాదా నాయక్‌
రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభమైనందున రేపటినుండి వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు అందరు యూనియన్లకు అతీతంగా ఐక్యంగా సమ్మెలో రావాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్‌ విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వైద్య ఆరోగ్యశాఖలోని ట్రేడ్‌ యూనియన్లు, క్యాడర్‌ యూనియన్లు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు అన్ని విధాల సహకరించాలని కోరారు.

Spread the love