– చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– పవర్‌లూమ్ కార్మికుల పోరాటానికి సంఘీభావం : కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌లో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వస్త్రపరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలనీ, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిరిసిల్ల నేత కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ అధ్యక్షతన నిర్వహించారు. సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తడుక శ్రీనివాస్, సిరిపురం లక్ష్మీనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పలు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమను బతికించాలని కోరుతూ నేతన్నలు 48 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరిగాదన్నారు. అక్కడ పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోవడానికి కేంద్రంలోని బీజేపీ అనుసరి స్తున్న విధానాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్డర్ల బిల్లులు విడుదల చేయకపోవడం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కారణమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.485.89 కోట్ల బకాయిలను చెల్లించాలనీ, గతంలో మాదిరిగానే యూనిట్‌కు రెండు రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. నేతన్న బీమా, త్రిఫ్ట్ ఫండ్, యారన్ సబ్సిడీ పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత, టెక్స్‌టైల్ బోర్డులను పునరుద్ధరించాలనీ, బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ హౌస్ కం వర్క్‌షెడ్, వర్కర్ టూ ఓనర్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..పవర్‌లూమ్, చేనేత కార్మికులకు పెరుగుతున్న ధరలకునుగుణంగా రెండేండ్లకోసారి కూలిరేట్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలొచ్చినా రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లశుద్ధి తప్ప నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే చిత్తశుద్ధి పాలకులకు లేదని విమర్శించారు. పవర్‌లూమ్ పరిశ్రమను దెబ్బతీసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ఏమాత్రం మాట్లాడని బండి సంజరుకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు మాట్లాడుతూ.. 30 వేల మంది కార్మికులు రోడ్డునపడ్డా, ఇద్దరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కార్మికులను అణిచివేయాలని చూస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ..ధనికులు ఎక్కువగా వినియోగించే వజ్రాలు, బంగారం ఆభరణాలపై మూడుశాతం, విమాన ప్రయాణికులపై ఐదు శాతం జీఎస్టీ విధించి వస్త్రపరిశ్రమపై మాత్రం 12 శాతం విధించడం దారుణమన్నారు. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ..గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుంటే మేము ఏం చేయాలంటూ మంత్రులు మాట్లాడటం, అర్థంలేని వాదనలు చేయడం సరిగాదని హితవు పలికారు. నేత కార్మికుల పక్షాన జరిగే ఐక్యపోరాటాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ..సిరిసిల్ల నేత కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రౌండ్‌టేబుల్‌లో వృత్తిదారుల సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎమ్‌వీ రమణ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.శివబాబు, టీఎన్‌టీయూసీ అధ్యక్షులు ఎంకే.బోస్, పాషికంటి లకీëనరసయ్య (తెలంగాణ చేనేత కార్మిక సంఘం-ఏఐటీయూసీ), వనం శాంతికుమార్ (తెలంగాణ చేనేత కార్మిక సంఘం, సీఐటీయూ), యాటల సోమన్న (ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్), అడిగోపుల సత్యనారాయణ (ఆప్కో మాజీ డైరెక్టర్), ఉ. రామ్‌చందర్, ఉడుత రమేష్ తదితరులు పాల్గొన్నారు.