నిర్ణయం మీదే

The decision is yours– 24 గంటలు కరెంటిచ్చే సీఎం కావాలా.. ఐదు గంటలిచ్చే వాళ్లు కావాలా..?
– రాష్ట్రం వచ్చాకే యాదాద్రిలో పెరిగిన భూముల ధరలు
– ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
– కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవనం నిర్మిస్తా
– నాడు తుంగతుర్తిలో హత్యారాజకీయాలు.. నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం
నవతెలంగాణ-కోదాడ, తుంగతుర్తి, యాదగిరిగుట్ట
కోదాడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను ఓడించడానికి అగ్రవర్ణాలు ఏకమయ్యాయని, వారంతా తనను ఓడిస్తారని ఆతనే స్వయంగా చెప్పారని, అయినా టికెట్‌ ఇచ్చి ఆశీర్వచించానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లయ్య యాదవ్‌ బీసీ బిడ్డ అని, జనాభాలో 70శాతం ఉన్న బీసీలు బీసీ చైతన్యం చూపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం తుంగతుర్తి నియోజకవర్గం హత్యారాజకీ యాలు, బీడుభూములతో కొట్టుమిట్టాడేదని.. నేడు ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశామన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చే తెలంగాణ రాష్ట్ర సీఎంను ఐదు గంటల కరెంటు ఇచ్చే కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ చేస్తాడా అని ప్రశ్నించారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, యాదగిరిగుట్ట నియోజకవ ర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సభలో లొల్లి చేయడం కాదు.. నవంబర్‌ 30న మల్లయ్య యాదవ్‌ గెలుపునకు అన్నం, నీళ్లు లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కోదాడ ప్రాంతంలో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తన దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగర్‌ జలాలను అనుసంధానం చేశామని, దాని ఫలితంగా కాళేశ్వరం జలాలు మోతే, నడిగూడెం మండలాలకు పారుతున్నాయని తెలిపారు. ఇటీవల పాదయాత్ర చేసిన కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క కాళేశ్వరం జలాలు మోతె, నడిగూడెం మండలాలకు రావడం లేదని ఆరోపించారని గుర్తుచేస్తూ.. సభలో ఆయా మండల ప్రజలతో ”కాళేశ్వరం జలాలు వస్తున్నాయా.. రావడం లేదా..” అని అడిగారు. వారు వస్తున్నాయని చెప్పడంతో కాంగ్రెస్‌ నాయకులు సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్‌ నిర్మిస్తానని, కోదాడ-సూర్యాపేట మధ్య పారిశ్రామిక అభివృద్ధికి డ్రై పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌, కోదాడ ఎమ్మెల్యే అభ్యర్ధులు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, తెలంగాణ ఉద్యమకారులు శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తిని చూస్తేనే తృప్తి కలుగుతుంది
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో తుంగతుర్తి.. హత్యారాజకీయాలు, బీడుభూములతో కొట్టుమిట్టాడేదని.. నేడు ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశామని, ఇప్పుడు తుంగతుర్తిని చూస్తే సంతృప్తిగా ఉందని అన్నారు. మరికొన్ని ప్రాంతాలకు నీళ్లు రావాల్సి ఉందని, దేవాదుల బునాది కాలువ పూర్తయినట్టయితే నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. తెలంగాణ కోసం మొట్టమొదట జైలుకు వెళ్లిన చెరుకు సుధాకర్‌, తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారి లాంటి ఎందరో కృషి మూలంగా తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో రూ.30 వేల కోట్లతో యాదాద్రి పవర్‌ప్లాంట్‌ కడుతున్నామని తెలిపారు. మూడు గంటల కరెంట్‌ కావాలో.. 24 గంటలు కరెంట్‌ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గాదరి కిశోర్‌కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను నమ్మకుండా అభివృద్ధికి పట్టం గట్టిన వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, కంచర్ల రామకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌, బీరవోలు రవీందర్‌రెడ్డి, రజాక్‌, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం వచ్చాకే యాదాద్రిలో భారీగా పెరిగిన భూముల ధరలు
యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని ఆరుట్ల ప్రాంగణంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాకముందు ఆలేరు ఎలా ఉండేదో ప్రస్తుతం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు. సాగు నీరు లేక కరెంటు రాక గోసలు పడ్డ పరిస్థితి ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తనకు సవాల్‌ విసరడం విడ్డూరంగా ఉందని, 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్ర సీఎంను ఐదు గంటల కరెంటు ఇచ్చేటోడు సవాల్‌ చేస్తాడా అని ప్రశ్నించారు. కలియుగ వైకుంఠంలా యాదాద్రి దేవాలయం నిర్మాణం చేశామన్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌ షావుకారులు యాదగిరిగుట్ట చుట్టూ భూములను అగ్వకు కొనుక్కొని వెళ్లారన్నారు. తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలకు భూముల ధరలు పెరిగాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత తనకు కూతురు లాంటిదని, ఆమె అడిగిన ఏ హామీని తాను కాదనకుండా తండ్రిలా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని, ఒక్క తెలంగాణలోనే వస్తుందన్నారు. కేంద్రం ఎన్ని కుతంత్రాలు చేసినా తాను ఒప్పుకోలేదన్నారు. రాష్ట్రం వచ్చాక ఆలేరు నుంచి వలసలు బందయ్యాయని అన్నారు. ఎన్నికల అనంతరం బస్వాపురం ద్వారా ఆలేరు ప్రాంతానికి సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సభలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, ప్రొఫెసర్‌ దినేష్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ మోత్కుపల్లి జ్యోతి, హాల్డా చైర్మెన్‌ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌ వస్పర్‌ శంకరయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ గడ్డమీద రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love