– కొందరి చేతుల్లో కేంద్రీకృతం అవుతున్న భూమి
– ప్రాథమికోన్నత పాఠశాలలకు మనుగడ లేదు : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందాల్సిన అవసరముందనీ, అదే నిజమైన సమ్మిళిత అభివృద్ధి అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. అప్పుడే తెలంగాణ మానవాభివృద్ధి సూచికలో ముందుంటుందని చెప్పారు. ఆదివారం శాసనమండలిలో ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగే సంపద అందరికీ అందాలనీ, ఆ దిశగా పాలన కొనసాగాలని సూచించారు. తలసరి ఆదాయం రూ.3.12 లక్షలుందని చెప్పారు. కానీ రాష్ట్రంలో నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.15,500 వేతనం వస్తున్నదని అన్నారు. వారి జీతాలు పెరిగితేనే సమ్మిళిత అభివృద్ధి అవుతుందన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు రూ.వంద కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయనీ, అవి కార్పొరేట్లు కొంటున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డలు భూములు కొనేలా ధరలను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. రాష్ట్రంలో భూమి కేంద్రీకృతమవుతున్నదనీ, కొద్దిమంది చేతుల్లోకి వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీళ్లు వెళ్తున్నా ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారనీ, ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ స్కూళ్లున్నాయనీ, వాటిలో 19 లక్షల మంది చదువుతున్నారని వివరించారు. 18,235 ప్రాథమిక పాఠశాలలున్నాయనీ, అందులో 1,290 స్కూళ్లు సున్నా ప్రవేశాలున్నవి, 1,600 స్కూళ్లు పది మందిలోపు, 2,600 స్కూళ్లు 20 మందిలోపు, 3,200 స్కూళ్లు 30 మందిలోపు, 1,050 స్కూళ్లు 50 మందిలోపు ఉన్నాయని వివరించారు. 50 మందిలోపు ఉన్నత పాఠశాలలు 450 ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 3,100 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయనీ, వాటికి మనుగడ లేదన్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని పిల్లలు ఎక్కువున్న పాఠశాలలు, బడిఈడు పిల్లలున్న గ్రామాల్లోని బడుల్లోనే అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు కలిపి 1,775 వరకు ఉన్నాయని చెప్పారు. వాటి ద్వారా చైనా విద్యాసంస్థలను నిర్వీర్యం చేయొచ్చని కోరారు.
విద్యావాలంటీర్లను నియమించాలి : జీవన్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు విద్యావాలంటీర్లను వెంటనే నియమించాలని కాంగ్రెస్ సభ్యుడు టి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 20 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయని చెప్పారు. టెట్‌కు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారనీ, వాటి ఫలితాలు వచ్చి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అయ్యే వరకు ఎన్నికలొస్తాయని అన్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యుతవకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇవ్వాలని కోరారు. చక్కెర కర్మాగారాలను తెరిపించాలని సూచించారు. రాష్ట్రంలో భూమి ఉన్న పటేల్ చనిపోతే రూ.ఐదు లక్షల బీమా వస్తున్నదనీ, పాలేరు చనిపోతే ఒక్క రూపాయి రావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమాన్ని
పాఠ్యాంశంగా తేవాలి : తాతా మధు
భారత స్వాతంత్య్ర ఉద్యమం తరహాలో తెలంగాణ ఉద్యమాన్ని సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా తేవాలని బీఆర్‌ఎస్ సభ్యుడు తాతా మధు సూచించారు. కల్పిత కథలైన రామాయణం, మహాభారతం కంఠస్తం చేస్తున్నామనీ, కానీ వాస్తవ కథ అయిన తెలంగాణ ఉద్యమాన్ని చదవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రవాస భారతీయుల శాఖను ఏర్పాటు చేస్తే మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బీఆర్‌ఎస్ సభ్యులు పి మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, టి భానుప్రసాదరావు, టి రవీందర్‌రావు, యెగ్గె మల్లేషం, పాడి కౌశిక్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, దయానంద్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే అసెంబ్లీ, శాసనమండలికి కొత్త భవనాన్ని కడతారని అన్నారు. దేశంలో నదులన్నీ అనుసంధానం కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఎంఐఎం సభ్యులు మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్‌లో పేదలకు 58 జీవో ప్రకారం ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : మండలిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఆదివారం శాసనమండలిలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు గత 31 రోజులుగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. నాలుగైదేండ్లలో వారి జీతాలను కొంత మేరకు పెంచినప్పటికీ నెలకు రూ.9,500 మాత్రమే వస్తుందని చెప్పారు. ఇది తక్కువగా ఉందనీ, వారి పనికి, పెరిగిన తలసరి ఆదాయం, జీడీపీ రీత్యా నెలకు రూ.25 వేల వరకు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల్లో స్వీపర్లు, పారిశుధ్య సిబ్బందికి రూ.16,500, డ్రైవర్లు తదితరులకు రూ.20 వేలపైన జీతం అడుగుతున్నారని తెలిపారు.
రాష్ట్రాల కన్నా ఎక్కువే ఇస్తున్నాం : హరీశ్ రావు
అలుగుబెల్లి నర్సిరెడ్డి చేసిన ప్రత్యేక ప్రస్తావనకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సమాధానమిస్తూ, గత పాలకులు గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు కేవలం రూ.1,500 మాత్రమే ఇచ్చేవారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వారికి రూ.9,500 చెల్లిస్తున్నదన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వారికి రూ.6,000 మాత్రమే చెల్లిస్తున్నారనీ, మరి కొన్ని రాష్ట్రాల్లో ఇంటింటికి రూ.25 చొప్పున వసూలు చేసుకునే పరిస్థితి ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ వారి శ్రమను, కష్టాన్ని గుర్తించి జీతం పెంచారని గుర్తుచేశారు.భవిష్యత్తులో వారిని మరింత ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందువల్ల కార్మికులు తమ సమ్మెను విరమించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు సమ్మెలను ప్రోత్సహిస్తున్నాయనీ, వాటికి ఇది తగదని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ రోగాలు పెరిగే అవకాశముందని చెప్పారు. అందువల్ల కార్మికులు తమ సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు.