చైనా-రష్యాలను దగ్గర చేసిన జి7 కూటమి!

చైనా-రష్యాలను దగ్గర చేసిన జి7 కూటమి!ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణా మాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకు గాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌, ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.
అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందనేది పరిశీలిస్తే గనుక అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది. 1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటు దేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.
ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. అయినా లేస్తే మనుషులం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు. చైనాను దెబ్బతీసేందుకు మిత్ర దేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ”ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేం దుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.
ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జిన్‌పింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జిన్‌పింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గతేడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రమేమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?
అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే పశ్చిమదేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.
చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ”ఓల్ట్‌ టైఫూన్‌” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌, నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా?
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love