నవతెలంగాణ-ఆలేరు టౌను
చేనేత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం ఆయన ఆలేరు పట్టణంలో చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన చేనేత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ దాసి శంకర్, కార్యవర్గ బృందం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నూతన పాలకవర్గం సంఘ అభివృద్ధికి, చేనేత కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి చేనేత అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంఘ సభ్యులు, జర్నలిస్టులు, పుర ప్రముఖులు చైర్మన్ దాసి శంకర్ కి,నూతన కార్యవర్గానికి శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, బీజాని బాలమణి, పిఎసిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంఎస్ విజయకుమార్, నీలం పద్మ, పద్మశాలి కుల బాంధవులు, చేనేత కళాకారులు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



