– తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయని పేర్కొంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని కోరింది. నష్టపోయిన ఆహార ధాన్యాలకు ఎకరాకు రూ.10వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.20వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి శోభన్ విలేకర్లతో మాట్లాడారు. అధిక వర్షాలు, వరదలతో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు, సోయా, వేరుశనగ, కంది, పెసర, పంటలు మునిగి పోయాయని తెలిపారు. రాష్ట్రంలో పంటల బీమా లేకపోవడం వల్ల రైతులకు భరోసా లభించడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వల్ల ఏటా లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరుగుతున్నదని అన్నారు. ఇందులో కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని పేర్కొన్నారు. తక్షణమే వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు జరిగిన నష్టాలపై అంచనా వేసి కేంద్ర బృందాన్ని పిలవాలని అన్నారు. ప్రకతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం జరిగిన నష్టంపై స్పందించకపోతే రైతాంగాన్ని కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.