Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి పేద కుటుంబానికి సొంతిల్లుఆ కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లుఆ కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ
ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబాటు
361 మంది లబ్దిదారులకు 2 బీహెచ్‌కే పట్టాల పంపిణీ : మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్


నవతెలంగాణ-సిటీ బ్యూరో
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదలు ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాలు నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే విలువైన ప్రభుత్వ భూములను కేటాయించడానికీ వెనుకాడబోమన్నారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలతో కలిసి మంత్రి 361 మంది లబ్దిదారులకు 2 బీహెచ్‌కే గృహాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పేదలు వివిధ వృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాలు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ భూములను వినియోగిస్తామని చెప్పారు. గత పదేండ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తూ పేదలు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఆ ఆలస్యానికి ప్రభుత్వ ప్రతినిధిగా విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇకపై సంక్షేమ పథకాల అమలులో జాప్యానికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో మరో రెండు లక్షల సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. వాంబే హౌసింగ్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మించిన పాత భవనాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త గృహాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్త ఇండ్ల కేటాయింపులో వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. పేదలకు శాశ్వత నివాసం కల్పించడం సామాజిక న్యాయంలో భాగమని, ప్రభుత్వం నిరంతరం పేదల పక్షాన నిలుస్తుందన్నారు.

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ.. మొత్తం 361 మంది లబ్దిదారులకు గృహాల పట్టాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇందులో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలానికి చెందిన 187 మంది, నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్ మండలానికి చెందిన 79 మంది, నాచారం కాలనీకి చెందిన 95 మంది లబ్దిదారులు ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మినరల్ కార్పొరేషన్ చైర్మెన్‌ అనిల్ కుమార్, వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్‌ చైర్మెన్‌ నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ నారాయణ, హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్, ఖైరతాబాద్ తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి, బండ్లగూడ తహసీల్దార్ ప్రవీణ్, గృహనిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -