కొత్తపల్లి- మనోహరాబాద్ మార్గం పైనే జిల్లా వాసుల ఆశలు

నవతెలంగాణ -సిరిసిల్ల
వస్త్రోత్పత్తి రంగంలో రెండో సోలాపూర్ గా పేరుంది జిల్లా కేంద్రంగా అభివృద్ధి పథం వైపు పయనిస్తున్న సిరిసిల్లా తో పాటు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్న వేములవాడకు రైలు మార్గం పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు రైలు కూత కోసం ఎదురుచూస్తున్నారు కొత్తపల్లి మనోహరాబాద్ బయలుమార్గం పూర్తయితే జిల్లా వాసులకు మేలు జరుగుతుంది పనులు సాధ్యమైనంత తొందరగా చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ భూసేకరణలోని వస్తున్న అడ్డంకులు మరింత జాప్యానికి కారణమవుతున్నాయి దీనిపై నేతలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
దశాబ్ద కాలం నుంచి ఎదురు చూడటమే…
రాజన్న సిరిసిల్ల జిల్లాను కలుపుతూ 151.36 కిలోమీటర్ల పొడవున కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని దత్త దశాబ్ద కాలం నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు ఈ రైలు మార్గాన్ని రూ1160.47 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది గతంలో ఈ మార్గానికి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో పనులు ముందుకు సాగిన దాఖలాలు లేవు గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రైలు మార్గానికి అవసరమైన భూసేకరణ దానికి అయ్యే వ్యయం అంతా భరించాలని రైల్వే శాఖ షరతు విధించడంతోపాటు నిర్మాణ పనుల్లో మూడోవంతు భరించాలని నిబంధన పెట్టింది కేంద్రం షరతులకు గత ప్రభుత్వం అంగీకరించడంతో రైలు మార్గం సర్వే పనులు మొదలుపెట్టారు మెదక్ సిద్దిపేట జిల్లాలో రైలు మార్గం సర్వే పనులు పూర్తికాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ యజమానులు అడ్డంకులతో సర్వే పనుల్లో జాప్యం జరిగింది జిల్లాలో 17 రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 950 ఎకరాల వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాల్సి ఉంది ఇందులో 12 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది జిల్లాలో దాదాపు 60 కిలోమీటర్ల పొడవు రైలు మార్గం రానుంది విస్తీర్ణపరంగా జిల్లాలో 50% మాత్రమే రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సర్వే పూర్తయిందని తెలుస్తుంది.
అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం…
రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం పెరుగుతుంది భూసేకరణకు అడ్డుకుంటున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది జిల్లాలో 950 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది ఈ భూసేకరణలో భూ యజమానులు అడ్డంకులు కల్పిస్తుండటంతో సర్వే పనులు చాలా ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దీంతో రైల్వే లైన్ పనులు ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది, సర్వే అధికారులు సర్వే చేయడం వరకే ఉంటుంది సమస్యను ఆయా ప్రాంతాల రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది వేములవాడ సిరిసిల్ల ప్రాంతాల్లో కొన్నిచోట్ల సర్వే పనులను అడ్డుకోవడంతో చేసేది లేక అధికారులు సర్వేను నిలిపివేశారు ఈ ప్రాంతాల్లో భూములు కోల్పోయే రైతులతో రెవెన్యూ యంత్రాంగం మాట్లాడి సమస్య పరిష్కరిస్తే సర్వే పనుల్లో వేగం పుంజుకుంటుంది రైలు మార్గం పూర్తయితే మెదక్ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా జిల్లా కేంద్రమైన సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తి ఎగుమతులు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది ఇది పరోక్షంగా కార్మికులకు లాభం కలగనుంది హైదరాబాదుకు రాకపోకలు పెరిగి వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడనుంది హైదరాబాదులో విద్యనభ్యసించే విద్యార్థులకు వివిధ రకాల వ్యాపారులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగపడనుంది దీంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వివిధ జిల్లాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ రైలు మార్గం ఉపయోగపడనుంది.

Spread the love