ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
దూపటి వెంకటేష్ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలకు నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు,మండల కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం మరింత భారంగా మారుతోందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల మార్పులు దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ఆ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు, నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందన్నారు.
వ్యవసాయ రంగంలో కూడా ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ యంత్రాల నిర్వహణ ఖర్చులు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. సాగు వ్యయం పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాల కొరత, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు,ఇంధన భారం కారణంగా మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందన్నారు.
ఇంధన ధరల పెరుగుదల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, రవాణాపై ఆధారపడిన వర్గాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రజలపై పెరుగుతున్న భారం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరల నియంత్రణకు చర్యలు తీసుకుని పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారుధరల నియంత్రణ చేపట్టకపోతే రాబోయే రోజుల్లో జీవన వ్యయం మరింత పెరిగి సామాన్యుడి బతుకు భారమవుతుందని, ప్రజలు తగిన సమయంలో ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి సూదగాని సత్యరాజయ్యతో పాటు సీపీఐ(ఎం) నాయకులు మోరిగాడి రమేష్,వడ్డేమాను బాలరాజు,కాసుల నరేష్,సంఘీ రాజు,యాసారపు ప్రసాద్,మోరిగాడి అశోక్,ఎండి మథిన్, ఎండి ఖలీల్,ఘనగాని రాజు,మోరిగాడి లక్ష్మణ్,ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.



