పార్టీలకు అతీతంగా పార్లమెంటులో
తెలంగాణ వాణి వినిపించండి
అవసరమైన సమాచారం ఇస్తాం : ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హాజరైన బీజేపీ ఎంపీలు ఈటల, కొండా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిపై
నిపుణుల కమిటీ వేయాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన సీఎం
ప్రాజెక్టులు, రవాణా అనుమతులు సాధించాలని దిశానిర్దేశం
ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయండి
అందర్నీ సమన్వయం చేసుకోవడం కోసం తెలంగాణ భవన్‌లో ఐఏఎస్ అధికారి నియామకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో గళాన్ని వినిపించాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. దానికోసం రాజకీయాలకు అతీతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సోమవారంనాడాయన హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఎంపీలతో భేటీ అయ్యారు. దీనికి కాంగ్రెస్ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు. అధికారపార్టీ నిర్వహించే ఎంపీల సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు కూడా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ర్ట అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ఎంపీలందరికీ అందచేస్తామని సీఎం చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మంజూరు కోసం విజ్ఞప్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, ఫేజ్-II విస్తరణకు సంబంధించి ఎస్బీఐక్యాబ్స్‌ను కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందనీ, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని సూచించారు. దీనికి బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో పనుల ప్రారంభానికీ, దక్షిణ భాగం భూ సేకరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం యత్నించాలని సూచించారు.
మూసీ పునరుజ్జీవం పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అనుమతి కోసం ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా, పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటకను ఒప్పించాలని సీఆర్ పాటిల్‌ను కోరామనీ, ఈ విషయంపైనా ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సూచించారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 300 టీఎంసీల నీటిని ఆ రాష్ర్టం వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయనీ, అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు. నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆ రెండింటిని రాష్ర్టానికి అనుకూలంగా సాధించాలని సీఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నుంచి నిరభ్యంతర పత్రాలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150 నుంచి151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లు, ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామన్నారు. ఎంపీలు వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీలకతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందిస్తూ, సమన్వయం చేసుకోవడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియమించామని తెలిపారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని మల్లు రవికి సీఎం సూచించారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం లేదనీ, స్టోరేజీ సమస్య ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్ మిల్లు పునరుద్ధరణపై మల్లు రవి అధికా రులను ప్రశ్నించారు. ఏడెనిమిది నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటుచేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారనీ, ఆ సమాచారం తీసుకుని ఆయా అంశాలకు సంబం ధించిన పెండింగ్ విషయాలు తెలియజేస్తే పార్లమెంట్ సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు.
ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ వేయండి-బీజేపీ ఎంపీలు
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని కోరారు. దీనికి సీఎం ఏ రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రపస్తావించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రామసహాయం రఘురామిరెడ్డి, చామల కిరణ్ కిమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



