విద్వేష ప్రసంగాల కట్టడికి యంత్రాంగం : సుప్రీం యోచన

విద్వేష ప్రసంగాల కట్టడికి యంత్రాంగం : సుప్రీం యోచనన్యూఢిల్లీ : దేశంలో కొందరు వ్యక్తులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించేందుకు పాలనాపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కో కేసును వ్యక్తిగతంగా పరిశీలించడం సాధ్యం కాదని, దీనివల్ల కేసుల ప్రవాహం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలను న్యాయస్థానం నిర్వచిస్తోందని అంటూ అయితే దీనిని ఎలా అమలు చేయాలి, ఎలా వర్తింపజేయాలి అనేదే ప్రశ్న అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన బెంచ్‌ పేర్కొంది. ‘ఒక్కో కేసును వ్యక్తిగతంగా పరిష్కరించలేము. ఒకవేళ అలా చేయడం మొదలుపెడితే కేసుల సంఖ్య పెరుగుతుంది. దానికి బదులు మౌలిక సదుపాయాన్ని లేదా పాలనాపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఒకవేళ అక్కడ ఏదైనా ఉల్లంఘన జరిగితే మీరు సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చు’ అని సుప్రీం బెంచ్‌ వివరించింది. పాన్‌ ఇండియా కేసులు చేపట్టడం సాధ్యం కాదని, వాటిని పరిష్కరించడం అసంభవమని తెలిపింది. ‘భారత్‌ వంటి పెద్ద దేశంలో సమస్యలు ఉంటాయి. అవసరమైనప్పుడు చర్య తీసుకునే పాలనా యంత్రాంగం మన వద్ద ఉన్నదా అనేదే ఇక్కడ ప్రశ్న. విద్వేష ప్రసంగం చేస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న విషయం సమాజానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. కాగా నోడల్‌ అధికారులను నియమించని తమిళనాడు, కేరళ, నాగాలాండ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Spread the love