4 నుంచి పార్లమెంట్‌

Parliament from 4– 18 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 4 నుంచి ప్రారంభమై.. 22వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ సమావేశాలలో మోడీ ప్రభుత్వం 18 బిల్లులను ప్రవేశపెడుతుంది. మహిళా రిజర్వేషన్‌ చట్టంలోని నిబంధనలను జమ్మూకాశ్మీర్‌, పాండిచ్చేరికి కూడా వర్తింపజేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులు, క్రిమినల్‌ చట్టాల స్థానంలో తీసుకొస్తున్న మూడు బిల్లులు కూడా వీటిలో ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఓ బులెటిన్‌ విడుదల చేసింది.
జమ్మూకాశ్మీర్‌ శాసనసభ స్థానాల సంఖ్యను 107 నుంచి 114కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. కాశ్మీర్‌ వలసవాదులు, పాక్‌ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌ నుండి వచ్చిన వారు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లులతో పాటు 2023-24 సంవత్సరపు గ్రాంట్లకు సంబంధించి తొలి విడత అనుబంధ డిమాండ్లను కూడా సభ ముందు ఉంచుతారు. ఈ డిమాండ్లపై శీతాకాల సమావేశాలలోనే చర్చించి ఆమోదిస్తారు.
మహిళా రిజర్వేషన్‌ బిల్లును వర్షాకాల సమావేశాలలోనే ఆమోదించారు. అయితే ఈ బిల్లును జమ్మూకాశ్మీర్‌, పాండిచ్చేరికి వర్తింపజేయలేదు. ఆయా కేంద్రపాలిత ప్రాంతాల పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఆర్టికల్‌ 239ఎ, 239ని అందులో చేర్చకపోవడంతో ఆయా ప్రాంతాలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును వర్తింపజేయలేదు. ఐపీసీ (1860), ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం (1872), సీఆర్‌పీసీ (1898) స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత బిల్లులను ప్రవేశపెడతారు. ఇటీవల బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లులకు 50కి పైగా సవరణలు సూచించిన విషయం తెలిసిందే.

Spread the love