Monday, May 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి ఇలాఖాలో అరిగోస పడుతున్న అన్నదాతలు

మంత్రి ఇలాఖాలో అరిగోస పడుతున్న అన్నదాతలు

- Advertisement -

– పాలకుల మాటలు నీటి మూటలేనా…
– అధికారుల నిర్లక్ష్యంతో మిన్నoటుతున్న నిరసనలు…
నవతెలంగాణ – కాటారం
: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి సొంత మండలం అయిన కాటారంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు, రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాస్తూ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం, అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. కాంటా వేసి బస్తాల్లో ధాన్యం నింపి వారం దాటినా లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపోతోంది. ఒకవైపు లారీలు లేక, మరోవైపు లోడింగ్ జరగక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వర్షాలు పడితే పంట పూర్తిగా నష్టపోతుందనే భయంతో కొందరు రైతులు ప్రైవేట్ లారీలు, ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు భారం రైతులపై పడుతోంది. పీఏసీఎస్ సెంటర్ల నిర్వాహకులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, లారీ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, అధికారుల మధ్య కుమ్మక్కు జరిగి రైతులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

వారం రోజుల వ్యవధిలోనే మంత్రి సొంత గ్రామమైన ధన్వాడ బస్టాండ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించగా, తాజాగా సోమవారం కాటారం మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ధర్నాకు దిగడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. కొనుగోళ్లలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ నిరసనలకు కారణమని రైతులు స్పష్టం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం రైతుల ఆవేదనను మరింత పెంచుతోంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ నీడ కోసం షెడ్లు లేక, తాగునీటి సౌకర్యం కూడా లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రింబవళ్లు ధాన్యం కాపలా కాస్తూ కొనుగోలు కేంద్రాల వద్దే గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.

జిల్లా కలెక్టర్‌ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -