‘ఉపాధి హామీ` నిర్వీర్యానికి కుట్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -పాన్‌గల్
మోడీ పాలనలో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. రాష్ట్ర మహాసభ పోస్టర్లు, కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో జాన్‌వెస్లీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ పాలమూరు జిల్లాలో 20, 21, 22 తేదీల్లో జరగనుందని, అందులో కార్మిక వర్గ సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై తీవ్ర భారాలు వేస్తోందని తెలిపారు. మహిళలు, కార్మికులు, గిరిజనులు, దళితులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభకు ప్రజలు, వ్యవసాయ కూలీలు, రైతులు పెద్దసంఖ్యలో హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిరంజన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు వి.భాస్కర్, సీపీఐ(ఎం) నాయకులు జి.వెంకటయ్య, శేఖర్, కోదండరాములు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ సర్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



