నేడు, రేపు హైదరాబాద్‌లో యువజన సమ్మేళనం
ఖాళీ ఉద్యోగ పోస్టులను
భర్తీ చేయాలి : సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -నల్లగొండ టౌన్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరనే నెపంతో 16 వేల పాఠశాల నుంచి 4000 పాఠశాలలకు కుదించడాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని, వాటిని నియంత్రించడానికి శాసనసభలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన మందులు, తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్‌ఎస్ గానీ, నేటి కాంగ్రెస్ గానీ, 12 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీగానీ ప్రణాళికాబద్ధంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈనెల 16, 17వ తేదీల్లో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాను నిష్పక్షపాతంగా చేపట్టాలని సీపీఐ(ఎం) కోరుతోందని చెప్పారు. గ్రామ, మున్సిపల్ కేంద్రాల్లో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓటర్ల జాబితాను తయారు చేయాలన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున అన్ని రకాల ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో సగం విడుదల చేసిన రైతు భరోసాతోపాటు ఖరీఫ్ రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్నారు. యూరియా అమ్మకం యాప్ ను రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకుదింపును ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



