వీడిన ఇద్దరు యువకుల మర్డర్ మిస్టరీ..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎట్టకేలకు ఇద్దరు యువకుల మర్డర్ మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడమే మర్డర్‌కు కారణమని తెలిసింది. జల్కం రవి ఈ నెల 4న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని వాటిని తమ గ్రామ గ్రూప్‌లో షేర్ చేశాడు. దీనిపై శేషిగారి శివగౌడ్ (24), గుండెమొని శివ (29) తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతటితో ఆగకుండా గ్రూప్ నుంచి జల్కం రవిని రిమూవ్ చేశారు. ఇదే విషయమై మాట్లాడుకుందామని రవి, రాజుగౌడ్ లు ఆ యువకులను వెంచర్‌లోని ఆఫీసుకు పిలిచారు. అక్కడ మద్యం సేవిస్తుండగా తన ఫొటోస్ ఎందుకు డిలీట్ చేశారని అడిగాడు. గ్రూప్ నుంచి తనను రిమూవ్ చేయడానికి కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో వాళ్ళ మధ్య మాట మాట పెరిగింది. అది కాస్తా హత్యకు దారి తీసింది. ఇద్దరు యువకులపై రవి, రాజుగౌడ్ కత్తులతో దాడి చేసి, నరికి చంపినట్లు తెలిసింది. అయితే వాట్సాప్ గ్రూప్ నుంచి డిలీట్ చేయడంతో హత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికంగా ఈ హత్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Spread the love