పేరు రైతులది సొమ్ము అక్రమార్కులది

– ‘అక్రమార్కులకు’ కాసుల వర్షం కురిపిస్తున్న చెరువులు
– బావులను మైమరిపిస్తున్న ‘చెరువులు’
– ప్రాణాంతకారంగా తయారు చేస్తున్న అక్రమార్కులు
– అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమార్కుల తోలకాలు
– మొద్దు నిద్రలో జోగుతున్న మండల అధికారులు
నవతెలంగాణ – బోనకల్‌
అక్రమార్కులకు చెరువులు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అక్రమార్కులకు మండల అధికారులు భయపడిపోతున్నట్లు పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. మట్టి అక్రమాలదే బోనకల్‌ రాజ్యం అన్నట్లుగా సాగుతోంది. పేరు రైతులది, సొమ్ము అక్రమార్కులది. అనేక చెరువులను మట్టి అక్రమార్కులు భవిష్యత్తులో ప్రాణాంతకారంగా తయారు చేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా మట్టిని విక్రయిస్తున్నారు. ప్రతిరోజు 2000 నుంచి 3000 ట్రాక్టర్ల వరకు వివిధ చెరువుల నుంచి మట్టిని తోడుతున్నారు. మండలంలో 22 గ్రామాలలోనూ చెరువులు ఉన్నాయి. వేసవికాలం కావడంతో కొంతమంది రైతులు ప్రారంభంలో తమ పొలాలను సారవంతంగా తయారు చేసుకునేందుకు మండల వ్యవసాయ శాఖ, మండల నీటిపారుదల శాఖల అధికారులకు చెరువు మట్టి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రారంభం సవ్యంగానే సాగింది. కొద్దిరోజుల తర్వాత అసలు రైతులు అడుగున పడి భూ అక్రమార్కులు తెరపైకి వచ్చారు. ముందుగా రైతులు వ్యవసాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత భూమి సర్వే నంబర్లు, ఆ భూమి ఎంత ఉంది అనే వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత మండల నీటిపారుదుల శాఖ అధికారులకు పంపిస్తారు. నీటి పారుదల శాఖ అధికారులు మండల వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ప్రకారం అనుమతులు మంజూరు చేస్తారు. ఈ అనుమతులలోనే స్పష్టంగా కొన్ని షరతులు కూడా విధిస్తారు. దరఖాస్తు చేసుకున్న రైతు దరఖాస్తులో పేర్కొన్న పొలంలోనే చెరువు మట్టి తోలుకోవాలి. చెరువు నుంచి కేవలం రెండు అడుగులు లోతు మాత్రమే మట్టి తీయాలి. అంతకుమించి లోతు తీయటానికి వీలు లేదు. చెరువు మట్టి ఎక్కడకు తరలిస్తున్నారనేది మండల వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయవలసి ఉంది. నిబంధనలు ఈ విధంగా చెబుతుండగా, ఈ నిబంధనలు ఎవరూ ఎక్కడ పాటించడం లేదు. తొలుత రైతులు తమ పొలాలకు చెరువుమట్టి తోలుకొన్నారు. కొన్ని రోజుల తర్వాత రైతుల పేరుతో కొంతమంది అక్రమార్కులు రంగ ప్రవేశం చేశారు. రైతుల పేరుతో దరఖాస్తు చేయించుకోవడం, ఆ రైతు పేరుతో అనుమతులు తీసుకొని తోలకాలకు గేట్లు తెరిచారు. రావినూతల, చిరునోముల, ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, నారాయణపురం, పెద్దబీరవల్లి, కలకోట, ఆళ్లపాడు తదితర గ్రామాలలోని చెరువుల నుంచి పెద్ద ఎత్తున అక్రమార్కుల మట్టిని తరలించారు. పొలాలకు వెళ్లవలసిన చెరువు మట్టిని మట్టి అక్రమార్కులు రెండు నెలల నుంచి పెద్ద ఎత్తున వెంచర్లకు, ప్లాట్లకు తరలించారు. ప్రతిరోజు 2000 నుంచి 3000 ట్రాక్టర్ల వరకు మట్టి మట్టిని తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌ 600 నుంచి 1000 రూపాయల వరకు మట్టి అక్రమార్కులు సంబంధిత వ్యక్తుల నుంచి కొల్లగొడుతున్నారు. కేవలం రావినూతల చెరువు నుంచే ఐదువేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించారు. ఇందులో సుమారు 30 శాతం కూడా వ్యవసాయ భూములకు వెళ్ళగా, దాదాపు 70 శాతం మట్టిని వెంచర్లు, ప్లాట్‌ లకు తరలించారు. రెండు నెలలుగా పెద్ద ఎత్తున భూ అక్రమార్కులు చెరువుల నుంచి మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా మొద్దు నిద్రలో జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమ మట్టి తోలకాలను కట్టడి చేయవలసిన అధికారులే పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో యథేచ్ఛగా మట్టి అక్రమ తోలకాలకు అక్రమార్కులు పాల్పడుతున్నారు. జేసీబీతో ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు పెడుతుండటంతో భవిష్యత్తులో ఆ చెరువు ప్రాణాంతకారంగా మారే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావినూతల, ఆళ్లపాడు చెరువులను చూస్తేనే ప్రాణాలు పోయే విధంగా తయారు చేశారు. బావులను తలపించే విధంగా తయారు చేశారు. రెండు రోజుల క్రితం రావినూతల గ్రామ ప్రజలు ఎదురు తిరగడంతో తోలకాలను నిలిపివేశారు. ఇప్పటికైనా మండల అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి చెరువులను మట్టి అక్రమార్కుల నుంచి కాపాడాలని ఆయా గ్రామాల ప్రజల కోరుతున్నారు.
పాట్లు, వెంచర్లకు మట్టి తోలుతున్న విషయం నిజమే.. : నీటిపారుదుల డీఈ వెంకటేశ్వర్లు
ఈ విషయంపై నీటిపారుదల శాఖ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లను వివరణ కోరగా తాము మండల వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే చెరువులలో మట్టి తోలకాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆ మట్టి అనుమతి తీసుకున్న ప్రకారం పొలానికి తోలుతున్నారా లేక ఇతర ప్రాంతాలకు తోలుతున్నారని అనేదానిపై నిఘా ఉంచాల్సింది మండల వ్యవసాయ శాఖ అధికారులదేనిని స్పష్టం చేశారు. అనుమతులు ఇచ్చేటప్పుడు ఇదే విధంగా షరతుల విధిస్తూ తాము అనుమతులు ఇస్తామని తెలిపారు. అనుమతులు తీసుకున్న కొంతమంది పొలాలక కాకుండా ప్లాట్లకు, వెంచర్లకు తోలుతున్నట్లు నిజమేనని అంగీకరించారు. కానీ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయవలసింది తాము కాదన్నారు.

Spread the love