రైతు ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి..

– రైతులకు లాభాల్ని చేకూర్చి పెట్టండి..
– ఆయిల్ ఫెడ్ ఎండీకి వినతి పత్రం అందించిన గ్రోవర్స్ సొసైటీ బాధ్యులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సహకార సంఘాల రెండు అంచెల నిర్మాణం కింద రైతు సమాజానికి లాభసాటి ధర ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు, నూనె గింజల పెంపకం దారులకు లాభసాటి ధరలను పొందేందుకు ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నూనె గింజలలో ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన ఇన్‌పుట్‌లు, సాంకేతిక మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం, సరసమైన ధరలతో వినియోగదారులకు ఎడిబుల్ ఆయిల్‌ను ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు అయిన ఆయిల్ ఫెడ్ లో సాగు దారులు లేక రైతులు భాగస్వామ్యం కొరవడిందని, కనీసం రైతు సంఘాల ప్రతినిధులకు సైతం ఆయిల్ ఫెడ్ వ్యవహారాల్లో ప్రమేయం లేకుండా సంస్థ ఏక పక్ష నిర్ణయాలతో, సంస్థలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అశ్వారావుపేట ఆయిల్ ఫాం జోన్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్యలు ఆయిల్ఫెడ్ ఎండీ కే. అశోక్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రంలో తెలిపారు. ఆయిల్ ఫెడ్ ఎండీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటి సారిగా మంగళవారం అశ్వారావుపేట వచ్చిన సందర్భంగా వారికి వినతి పత్రం అందజేసారు.
వినతి పత్రం యథాతథ సారాంశం..
శ్రీయుత గౌరవనీయులైన ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరక్టర్  కె.అశోక్ రెడ్డి, ఐఎఎస్  దివ్య సముఖము కూడానకు, ఆయిల్ఫెడ్ ఎండీగా నియమితులైన మీకు మనఃస్పూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ..
అయ్యా,
ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయిల్ ఫెడ్ నుండి రైతులు ఆశిస్తున్న కొన్ని విషయాలు తమ దృష్టికి తీసుకువస్తున్నాము.
– ఆయిల్ ఫెడ్ రిజిస్టర్డ్ అండర్ కో- ఆపరేటివ్ యాక్ట్ 1964 అయినప్పటికీ ఇందులో భాగస్వాములైన రైతులతో జనరల్ బాడీ మీటింగులు ఏర్పాటు చేయుటలేదు. త్వరలోనే తమ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయగలరని ఆశిస్తున్నాము.
– ఆయిల్ ఫెడ్ లో ఉత్పత్తి అయిన సి.పి.ఓ. లో 75% వాటా వున్న రైతులను ఆయిల్ అమ్మకాలలో భాగస్వాములను చేయడం లేదు. అందుకు తమరు చొరవ తీసుకొని, ధరల నిర్ణాయక కమిటీలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని ఆశిస్తున్నాము.
– 2018 నుండి తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ఫైడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మొక్కలలో పెద్ద ఎత్తున ఆఫ్ టైప్ మొక్కలు రావడం జరిగింది. ఇట్టి విషయమై తగు విచారణ జరిపించి బాధిత రైతులను ఆదుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– గత 5 / 6 సం.ములుగా దారి తప్పిన ఆయిల్ ఫెడ్ వ్యవస్థను నర్సరీలు, విత్తన మొలకల దిగుమతులు, మొక్కల పంపిణీ, ఆయిల్ ఫెడ్ లో అనవసరపు ఖర్చులు, అవినీతి తదితర అంశాలపై తగు విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ నిలకడలేని పన్నుల విధానంతో ధర పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవడం కోసం ఒక టన్నుకు గాను రూ.20,000/-లు మద్దతు ధర నిర్ణయించి, ధర తగ్గినప్పుడు ఆయిల్ ఫెడ్ / రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ధరకు – మద్దతు ధరకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ఆయిల్ ఫెడ్/ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Spread the love